టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం కోసం హుజూర్ నగర్లో నిర్వహించాలనుకున్న సభ రద్దు అయింది. వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ ప్రకటించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో… హెలికాఫ్టర్ ఎగరడానికి పర్మిషన్ ఇవ్వలేదని.. ఏవియేషన్ డైరక్టర్ తరపున ప్రకటన వచ్చింది. హుజూర్ నగర్లో కేసీఆర్ సభపై.. రాజకీయ వర్గాల్లో మొదటి నుంచి ఆసక్తి ఏర్పడింది. దానికి కారణం ఆర్టీసీ సమ్మె. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని కేసీఆర్ ప్రకటించేసిన తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన తరవాత కేసీఆర్ ఒక్క సారి కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ప్రెస్ నోట్ల ద్వారానే ఆయన స్పందన తెలుస్తోంది. ఈ క్రమంలో.. హుజూర్ నగర్లో బహిరంగసభ ఏర్పాటు చేయడంతో.. అక్కడ స్పందిస్తారని అనుకున్నారు. కానీ.. సభ రద్దు అయింది.
హుజూర్ నగర్ సభ సాక్షిగా… తమ నిరసన తెలియచేయాలని ఆర్టీసీ కార్మికులు కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరింది. కేసీఆర్ హుజర్ నగర్ సభకు వచ్చి కార్మికులపై మరింత కఠినపదజాలం వాడితే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుందేమోనని.. టీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చెందారు. ఈ క్రమంలో కేసీఆర్ పర్యటన అటు ప్రతిపక్షంతో పాటు.. ఇటు టీఆర్ఎస్లోనూ… టెన్షన్ రేపింది. అయితే.. అనుకోని అతిథిలా వర్షం రావడంతో… సభ రద్దయింది. దాంతో.. హుజూర్ నగర్ ఉపఎన్నికలో అగ్రనేతల ప్రచారం లేకుండా పోయినట్లవుతుంది.
నిజానికి హుజూర్ నగర్లో పరిస్థితి బాగో లేదని… ప్రచారానికి కేసీఆర్, కేటీఆర్ వెళ్లడం లేదన్న ప్రచారం జరిగింది. కేటీఆర్ ఒక్క రోజు మాత్రమే రోడ్ షో నిర్వహించారు. తర్వాత మూడు రోజుల పాటు.. అక్కడే ఉండేలా .. రోడ్ షోలను షెడ్యూల్ చేశారు. కానీ.. తర్వాత వాటిని క్యాన్సిల్ చేశారు. కారణం ఏమీ చెప్పలేదు కానీ… స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కేసీఆర్ సభ కూడా ఉండదని మౌఖికంగా పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. కానీ అనూహ్యంగా పదిహేడో తేదీన సభ ఉంటుందని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి చేసేసరికి వర్షం వచ్చి పడింది. దీంతో సభ రద్దయింది. ఎలా రద్దయినా… కేసీఆర్ హుజూర్ నగర్‌కు వచ్చేందుకు భయపడ్డారని విపక్షాలు మాత్రం విమర్శలు ప్రారంభించాయి.