తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మరింత తీవ్రరూపం దాల్చుతోంది. అధికార పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీలూ ప్రజా సంఘాలూ ఉద్యోగ సంఘాలూ సమ్మెకి మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం, కార్మికులు ఒక మెట్టు దిగి చర్చించుకోవాలని కోర్టు చెప్పినా… ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. కార్మికులు కూడా అదే స్థాయిలో బిగుసుకు కూర్చున్నారు. ఇవాళ్ల కోర్టులో ప్రభుత్వం తన వాదనను వినిపించబోతోంది. సమ్మె ప్రభావం ప్రజలపై లేదనీ, 90 శాతం బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంతరాలు లేకుండా నడిపిస్తోందని గట్టిగా చెప్పాలంటూ సీఎం కేసీఆర్ సమీక్షలో చెప్పినట్టు సమాచారం. ఇదే అంశమై రాజ్ భవన్ కేంద్రంగా గురువారమంతా హడావుడి కనిపించింది. సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు.
గవర్నర్ పిలుపుతో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ ఇన్ చార్జ్ ఎండీ సునీల్ శర్మ హుటాహుటిన రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలుసుకున్నారు. ప్రభుత్వం బస్సులు నడుపుతోందనీ, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేస్తున్నామని ఆమెకి వివరించారు. ఆర్టీసీ ఆస్తుల లీజు, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన స్థలాలు వంటి వివరాలను తనకు ఇవ్వాలంటూ గవర్నర్ ఆదేశించారు. రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయనీ, కార్మికులతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలేకపోతోందని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. దాదాపు ఐదు గంటలపాటు రవాణాశాఖ మంత్రి, అధికారులతో గవర్నర్ తమిళిసై సమ్మె అంశంపై సుదీర్ఘంగా చర్చించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
సమ్మె నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ ను కేంద్ర హోం శాఖ కోరినట్టు సమాచారం. సమ్మె పరిస్థితులపై ఆమె ఇప్పటికే కేంద్రానికి ఒక నివేదిక పంపించారని తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల సమస్య కంటే… ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం జోక్యం చేసుకుంటుందని సమాచారం. సమ్మె వ్యవహారం రాజకీయంగా కేసీఆర్ కి ఇబ్బందికరమైన పరిణామంగానే మారుతోంది. కాబట్టి, ఇదే తరుణంలో భాజపా కూడా పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహంతో ఉందనేది కనిపిస్తూనే ఉంది!