వైఎస్ జగన్ మనస్థత్వంలో ప్రజల్లో చర్చ పెట్టాలనుకున్న ఆంధ్రజ్యోతి .. కావాలనే.. ఆయనను రెచ్చగొడుతోందా..?. ఈ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి చాలా సులువుగా చిక్కిపోయారా..? ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు చూస్తే.. అలాగే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం జగన్ వర్సెస్ ఆంధ్రజ్యోతి అన్నట్లుగా సాగిపోతోంది. ఆంధ్రజ్యోతి .. తాము నిఖార్సైన మీడియా అన్నట్లుగా ప్రభుత్వంపై చెలరేగిపోతోంది. ప్రజల్లో ఓ రకమైన అనుమానాలు రేపేలా కథనాలు ప్రచురిస్తోంది. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో… దీనికి బేస్ కూడా.. ఆయా కథనాలను లభిస్తోంది. వీటిపై క్లారిటీ ఇచ్చి.. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాల్సిన జగన్ సర్కార్…పట్టుదలకు పోయి.. ప్రజల్లో మరిన్ని అనుమానాలు పెంచుకుంటోంది. జగన్ మనస్థత్వం కచ్చితంగా అంచనా వేసిన ఆంధ్రజ్యోతి… ఆయనను మరింత రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురిస్తూ… తాను అనుకున్న ఎఫెక్ట్ సాధిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సచివాలయ ఉద్యోగ పరీక్షల విషయంలో వచ్చిన అనుమానాలు అన్నీ ఇన్నీ కావు. పరీక్షలు రాసిన వారందరిలోనూ ఉన్నాయి. అత్యంత కఠినమన పరీక్షల్లో టాపర్లకు 120 వరకూ మార్కులు రావడం నమ్మశక్యం కాకపోవడం ఒకటి అయితే .. ఉద్యోగ అర్హత సాధించిన.. అనేక మందికి 50లోపు మార్కులు వచ్చాయి. 120 మార్కులు సాధించిన వారు గతంలో ఏ పరీక్షల్లోనూ సక్సెస్ అయిన వారు కాదు. అలాగే ఒకే సామాజికవర్గం వారికి జనరల్ కేటగిరీలో అత్యధిక ఉద్యోగులు వచ్చాయి. ఈ అనుమానాలను నివృతి చేయాల్సిన ప్రభుత్వం.. ఆంధ్రజ్యోతి చెప్పిందనే కారణంగా.. కనీసం విచారణ కూడా చేయించలేదు. దాంతో ప్రజల్లో అనుమానాలు బలపడిపోయాయి. పోలవరం రివర్స్ టెండరింగ్ కు.. ఎలక్ట్రిక్ బస్ టెండర్లకూ… ఆంధ్రజ్యోతి ముడిపెట్టి కథనాలు రాసిందని…ఏపీ సర్కార్ మరింతగా రెచ్చిపోయింది. అలాంటిదేమీ లేదని నిరూపించుకోవడం ప్రభుత్వానికిపెద్ద పని కాదు. కానీ రహస్యంగా ఉంచేస్తూ… ఆంధ్రజ్యోతిపై ఎదురుదాడికి దిగింది.
ఆంధ్రజ్యోతిపై నిర్బంధాలతో… వారు నిజాలు చెబుతున్నారని… అందుకే ప్రభుత్వం సహించలేకపోతోందన్న అభిప్రాయం .. ప్రజల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు .. ఇప్పటికిప్పుడు వచ్చే సమస్యేమీ లేదు కానీ.. ముందు ముందు మాత్రం.. ఏం చేసినా.. ప్రజలు.. అనుమానంగా చూసే పరిస్థితి వస్తుంది. పారదర్శక పాలన అందిస్తానని చెప్పిన జగన్.. .. విమర్శలను సహించలేకపోతున్నారని.. చివరికి అధికారం అండతో వేధింపులకు కూడా దిగుతున్నారన్న భావన అందరిలోనూ వ్యాపిస్తోంది. జగన్ … సహనంగా ఉండలేరని అంచనా వేసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా.. ప్రభుత్వంపై దాడిని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఆవేశ పడితే.. చివరికి నష్టపోయేది.. జగనే. ఆంధ్రజ్యోతికి తాత్కాలికంగా ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు కానీ.. ప్రజల్లో పెరిగే విలువతో ఆ పత్రిక స్థానం మరింత సుస్థిరమవుతుంది.