Raju Gari Gadhi 3 Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
హారర్, కామెడీ ఈ రెండింటినీ మిక్స్ చేసినవాళ్లెవరో గానీ, ‘రాజుగారి గది 3’ లాంటి సినిమాలు చూసినప్పుడల్లా వాళ్లు తప్పకుండా గుర్తొస్తారు. భయపెడుతూ నవ్వించడం…. నవ్విస్తూ భయపెట్టడం – చాలా కష్టమైన విద్య. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది లాంటి సినిమాలు ఈ మేళవింపులో సక్సెస్ అయ్యాయి. ఈ రెండింటి తూకంలో ఏమాత్రం తేడా వచ్చినా కామెడీ భయపెడుతుంది. భయం నవ్వుల పాలవుతుంది. అందుకే ఈ జోనర్లో వచ్చిన చాలా సినిమాలు పల్టీలు కొట్టాయి. అయినా సరే, అలాంటి ప్రయత్నాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. ఆ జాబితాలో మరో సినిమా వచ్చి చేరింది. అదే `రాజుగారి గది 3`.
`రాజుగారి గది`తో భయపెడుతూ నవ్వించడం తనకూ వచ్చని నిరూపించుకున్నాడు ఓంకార్. రాజుగారి గది 2తో పాస్ మార్కులు పడ్డాయి. అయితే… ఇప్పుడు ముచ్చటగా మూడో గది తలుపులు తెరిచాడు.
కథలో కాస్త వైవిధ్యం ఉంది. ఇది వరకటి సినిమాల్లోలా కేవలం ఈ డ్రామాని ఒక బంగ్లాకో, ఇంటికో పరిమితం చేయకుండా `కాలనీ`కి లాక్కొచ్చాడు. అక్కడ అశ్విన్ (అశ్విన్ బాబు)లాంటి ఓ చిచోర ఆటో డ్రైవరు. కాలనీ ప్రెసిడెంటుతో సహా, అక్కడివాళ్లందరినీ ఓ ఆట ఆడేసుకుంటుంటాడు. అలాంటి వాడు.. మాయ (అవికా గోర్) అనే ఓ డాక్టర్ ప్రేమలో పడతాడు. ఆ డాక్టర్ అలాంటి ఇలాంటి డాక్టరు కాదు. ఎవరైనా తన వెంట పడితే, వేధిస్తే, ‘ఐ లవ్ యూ’ అనే పదం వాడితే చాటుగా ఉన్న ఓ దెయ్యం వాళ్లతో ఓ ఆట ఆడేసుకుంటుంది. అలాంటి అమ్మాయిని ఓ అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది ఈ కథలో సారాంశం.
ఈ పాయింటుని `థిల్లుకు దుడ్డు 2` అనే ఓ తమిళ సినిమా నుంచి పట్టుకొచ్చాడు ఓంకార్. మనం టోటల్‌గా ఈ కథలో ఏదైనా కొత్తగా ఉంది అనుకుంటున్నామో, ఆ పాయింటు తనది కాదు. మాతృకలోని కొన్ని సన్నివేశాల్ని షాట్స్‌తో సహా యధాతథంగా వాడుకున్నాడు ఓంకార్. డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చిన కథ కాబట్టి, ఆ మాత్రం చొరవని తప్పు పట్టలేం. కాకపోతే… తమ్ముడ్ని హీరోగా ఎలివేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫోకస్ అంతా అటు పెట్టడంతో – ఇటు కథనీ, అందులో భయాన్ని, దాని నుంచి పుట్టుకు రావాల్సిన వినోదాన్ని పక్కన పెట్టేశాడేమో అనిపిస్తుంది. హీరోగారి ఎంట్రీనే ఓ మాస్ సాంగ్‌తో. అది కాస్త అర్థం కాదనుకోండి. అది వేరే విషయం. కాలనీలో వాళ్లని ఆటాడుకునే సన్నివేశాల్లో అరవ తరహా కామెడీ ఎక్కువగా కనిపిస్తుంది. హీరోయిన్‌కి ఐ లవ్ యూ చెప్పే సన్నివేశాల్లో దెయ్యం వచ్చి ఓ ఆట ఆడేసుకుంటుంది. అక్కడి వరకూ ఓకే. కానీ మిగిలినదంతా భరించడం మాత్రం కష్టం. ఫస్టాఫ్‌లో చాలా లోపాలు. దాంతో పాటు.. విసిగించే కామెడీ. నత్త నడక స్క్రీన్ ప్లే. కాంచన, కాష్మోరా లాంటి సినిమాల ప్రభావం కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంటుంది. పాత దెయ్యం సినిమాల్లోని సీన్లను పేరడీ చేసినట్టు అనిపిస్తుంది.
ద్వితీయార్థంలో ఓంకార్ కథ తేరుకుని, కథలోకి వచ్చాడు. ఎప్పుడైతే యక్షిణి ఆత్మని బంధించడానికి బంగ్లాలోకి వస్తారో, అప్పటి నుంచీ కాస్త నవ్వులు మొదలవుతాయి. ఊర్వశి, అజయ్ ఘోష్ కాంబోలో వచ్చిన సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. వీళ్లకు అలీ కూడా తోడయ్యాడు. అలీ – అజయ్ ఘోష్ మధ్య జరిగే `తలుపు చాటు` కామెడీ.. థియేటర్లో బాగా పేలింది. కిట్ కాట్ యాడ్‌ని వాడుకున్న సీన్ కూడా బాగా వచ్చింది. నవ్వుల్ని పంచే ధ్యాసలో పడిపోయి.. అక్కడక్కడ కాస్త ఓవర్ చేశాడు దర్శకుడు. ఎక్కడి నుంచి తెచ్చాడో గానీ, దెయ్యాల్ని కూడా మరీ కామెడీ ఫేసులుగా చూపించాడు. దాంతో భయం అనే ఎలిమెంట్ పూర్తిగా మాయమైపోయింది. సెకండాఫ్ అంతా హారర్ ఎక్కడా కనిపించదు. కనీసం యక్షిణి ఎంట్రీతోనైనా భయం పుట్టాల్సింది. అదీ జరగలేదు. ద్వితీయార్థంలో కామెడీ వర్కవుట్ అవ్వకపోతే – రాజుగారి గది 3కి పూర్తిగా తలుపులు మూసుకుపోదును.
అశ్విన్ బాబుని హీరోగా నిలబెట్టాలని ఓంకార్ చేసిన ప్రయత్నం ఇది. అది కాస్త వర్కవుట్ అయ్యింది. అశ్విన్ ఫైట్లు చేయగలడు, డాన్సులు చేయగలడు, దెయ్యం చేత దెబ్బలూ తినగలడు అనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. అశ్విన్ స్క్కీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే.. ఎవరినో ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్థమవుతూ ఉంటుంది. తనకంటూ ఓ స్టైల్ సృష్టించుకోవడం అవసరం. తమన్నాని పక్కన పెట్టి అవికాని ఎంచుకున్నప్పుడే, హీరోయిన్ పాత్రని తగ్గించేశారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవికా ఈ సినిమాలో చేసిందేం లేదు. తన పళ్లు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. దాంతో.. క్లోజప్‌లో అవికని చూడడం ఇబ్బంది అవుతోంది. తొలి సగంలో భయపెట్టే బాధ్యత అవికాపై వదిలేస్తే.. బాగుండేది. అలా చేస్తే అశ్విన్‌పై ఉండాల్సిన ఫోకస్ అవికాపై పడుతుందని ఓంకార్ భయపడి ఉంటాడు. అందుకే ఆ సాహసం చేయలేదు. తొలి సగంతో పోలిస్తే… ద్వితీయార్థంలోనే అలీ నవ్వించగలిగాడు. అజయ్ ఘోష్ – ఊర్వశిల కాంబో వర్కవుట్ అయ్యింది.
ఈ సినిమాకి ప్రధాన బలం.. ఛోటా పనితనం. తన కెమెరాతో రిచ్ లుక్ తీసుకొచ్చాడు. తన కలరింగ్, కెమెరా వర్క్ తప్పకుండా నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. బుర్రా సాయిమాధవ్ తొలిసారి పంచ్‌ల కోసం తాపత్రయ పడ్డాడు. ఓంకార్ తొలి సగంలో బాగా తడబడ్డాడు. ద్వితీయార్థంలో తేరుకుని ఈ సినిమాని గట్టున పడేసే ప్రయత్నం చేశాడు. తొలి సగంలో కూడా కాస్త ఫన్ పండించగలిగితే బాగుండేది.
హారర్, కామెడీ – ఈ జోనర్ చాలా ప్రమాదమని ఇప్పటికైనా దర్శకులు గ్రహించాలి. భయం అనేది అల్టిమేట్ ఎమోషన్. దాన్ని కామెడీతో తగ్గించకూడదు. హారర్ సినిమాల్ని ఎవరైనా భయపడడానికే చూస్తారు. వెకిలి వేషాలేసే దెయ్యాల్ని తీసుకొచ్చి కామెడీ చేయాలనుకుంటే, అటు భయం, ఇటు వినోదం రెండూ మిస్ అయిపోతాయి. ఈ విషయాన్ని నవతరం దర్శకులు గుర్తించుకుంటే మంచిది.
ఫినిషింగ్ టచ్: భయం లేదు గానీ, నవ్వులున్నాయి
తెలుగు360 రేటింగ్: 2.25/5