ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్మికులతో చర్చలు జరిపి తీరాల్సిందేనని ఆదేశించింది. తేదీసమయాన్ని కూడా నిర్దేశించింది. శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు ప్రారంభించాలని స్పష్టం చేసింది. కార్మికుల డిమాండ్లలో ఎక్కువ భాగం పరిష్కరించదగ్గవే ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాలుగా.. కార్మికులు సమ్మె చేస్తూంటే.. ప్రభుత్వం ఆపేందుకు ఎందుకు ప్రయత్నించలేదని… హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు.. శనివారం బంద్ జరగనుంది. దీనిపైనా హైకోర్టు వాదనలు జరిగాయి. బంద్‌కు తెలంగాణలోని క్యాబ్స్, టీఎన్జీవోస్.. ఇతర సంఘాలు కూడా మద్దతు పలికినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు.
ఆర్టీసీ ఎండీని నియమించమని ఆదేశించినా.. ప్రభుత్వం పాటించకపోవడం కూడా… వాదనల్లో ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ ఎండీ నియామకం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. అయితే పరిష్కారం దిశగా ఓ అడుగుపడుతుంది కదా..అని ధర్మాసనం ప్రశ్నించింది. వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాక్యలు చేసింది. ప్రజలు శక్తిమంతులని… స్పష్టం చేసింది. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని.. న్యాయస్థానం హెచ్చరించింది. వెనిజులా రాజు విషయంలో జరిగిన వ్యవహారాలను… ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజలే ప్రజాస్వామ్యమని.. ప్రజల కంటే ఎవరూ గొప్ప వారు కాదనీ.. హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలని తెలిపింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదనుకున్న తెలంగాణ సర్కార్ కు.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై ఏం చేయాలన్నదానిపై.. ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్న భావన రావాలంటే.. ఇప్పుడు చర్చలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అదే సమయంలో.. రేపటి బంద్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక నేతలు సిద్ధమయ్యారు. క్యాబ్‌లు కూడా రేపటి నుంచి ఆగిపోనున్నాయి.