” గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన సీఎం హోదాలో ప్రతీ వారం కోర్టుకు రావడం వల్ల రూ. 60 లక్షల ప్రజాధనం.. రెండు రోజుల సమయం వృధా అవుతుంది. అందుకే… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వండి..” అంటూ.. జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. నిజానికి ఈ వాదనలు ఊహించనివి. ఎందుకంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు కాలేదు. కనీసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసులు నమోదు కాలేదు. వ్యక్తిగత హోదాలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిందితునిగా ఉన్నారు. సీఎం జగన్ కాదు. అందుకే.. వైఎస్ జగన్ తరపు లాయర్ల వాదన అందరికీ భిన్నంగా అనిపించింది.
వ్యక్తిగత కేసుల హాజరుకు “హోదా లింక్” ఎందుకు..?
వ్యక్తిగత పర్యటలను జగన్మోహన్ రెడ్డి … పూర్తి పర్సనల్‌గా భావిస్తారు. ఎంతగా అంటే.. ఆయన తన విమాన టిక్కెట్లను.. పర్యటన ఖర్చులను కూడా.. తానే భరిస్తారు. అలా… ఓ సారి జీసస్ క్రైస్ట్ ను సేవించుకునేందుకు జెరూసలెం … తన బిడ్డను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా మరోసారి వెళ్లారు. ఇంతగా విలువలు పాటిస్తున్న ముఖ్యమంత్రి.. తనపై దాఖలైన వ్యక్తిగత కేసులకు మాత్రం ముఖ్యమంత్రి హోదాను జత చేయడం… ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఇదే వాదనను కోర్టులో ప్రధానంగా వినిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసు నమోదయినప్పుడు జగన్ సీఎం కాదు. అందుకే ఇతర అంశాల్లో జగన్ వ్యక్తిగత విషయాలకు… తన హోదాను పక్కన పెట్టినట్లే.. కేసుల విషయంలోనూ.. పదవిని పక్కన పెట్టి వ్యక్తిగతంగా తేల్చుకునే దిశగా ఆలోచిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతోంది.
ఆ ఖర్చు అయితే వ్యక్తిగతంగా భరించవచ్చు కదా..!?
జగన్ కోర్టుకు హాజరైతే.. ప్రజాధనం రోజుకు రూ. 60 లక్షలు వృధా అవుతుందన్న వాదనను బలంగా వినిపించారు జగన్ తరపు న్యాయవాదులు. జగన్మోహన్ రెడ్డి .. శుక్రవారం.. ఓ వివాహ కార్యక్రమానికి.. మరో నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమరావతి నుండి హైదరాబాద్‌కు వచ్చారు. అదీ కూడా ముఖ్యమంత్రి హోదాలోనే వ్యక్తిగత పర్యటన చేశారు. దానికి ఎంత ఖర్చు అయిందో కానీ.. రూ. 60లక్షలు మాత్రం అయ్యే అవకాశం లేదు. కానీ కోర్టుకు హాజరయ్యేందుకు మాత్రం.. రూ. 60 లక్షలు ప్రజాధనం ఖర్చు అవుతుందంని వాదించారు. నిజంగా అంత మొత్తం ఖర్చు అయ్యే పని అయితే.. గతంలో తాను పాటించిన విలువల ప్రకారం.. వ్యక్తిగత పర్యటనగా మార్చుకోవచ్చు కదా..!. ఆ ఖర్చులేవో… అక్రమాస్తుల కేసులో నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి భరిస్తే … తన ఆదర్శాలను మరింతగా పెంచినట్లు అవుతుంది కదా..!?
చట్టం ముందు అందరూ సమానమే..!
ముఖ్యమంత్రి కావడం అనేది.. చట్టం నుంచి అదనపు ప్రయోజనాలు పొందడానికి ఏ మాత్రం ప్లస్ పాయింట్ కాదు. రాజ్యాంగం అదే చెప్పింది. చట్టం ముందు అందరూ సమానమేనని..!. దీనికి భిన్నంగా… హైకోర్టులో జగన్ లాయర్లు వాదన వినిపించారు. తమ క్లైంట్ ఇప్పుడు.. ముఖ్యమంత్రి అయ్యారని… అందుకే కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు కావాలని కోరుతున్నారు. ఓ వ్యక్తి సీఎం అవడం ద్వారా… చట్టం నుంచి ప్రయోజనం పొందవచ్చునని కోర్టు ఏ విధంగానూ చెప్పలేదన్న అభిప్రాయం… న్యాయనిపుణుల్లో ఉంది.