ఆంధ్రపోలీసులపై నమ్మకం లేదంటూ.. ఎన్నికలకు ముందు హడావుడి చేసి.. దేశవ్యాప్తంగా.. ఏపీ పోలీసులపై అనుమానాలు రేకెత్తించేలా చేసిన వైసీపీ.. ఇప్పుడు.. అదే పోలీసులకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ… రాజకీయ పోరాటం ప్రారంభించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఏపీలో ఏం జరిగినా.. పోలీసులంతా చంద్రబాబు మనుషులేనన్నట్లుగా.. టీడీపీ కార్యకర్తలేనన్నట్లుగా ఆరోపణలను ఆ పార్టీ నేతలు చేసేవారు. చివరికి.. చంద్రబాబు సభ కోసం.. ఓ రైతును పోలీసులు కొట్టి చంపారని కూడా ఆరోపణలు చేశారు. అలాంటి వైసీపీ నేతలు… ఇప్పుడు పోలీసులు పరువును టీడీపీ నేతలు తీస్తున్నారంటూ… కొత్త ఉద్యమం ప్రారంభించారు. నేరుగా.. చంద్రబాబుపై… పోలీసులకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించ పరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యే అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని చర్యుల తీసుకోవాలని కోరారు.
వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతా మంచోళ్లయిపోయారు. దేశంలోనే అత్యంత సమర్థులైన అధికారులైపోయారు. కానీ.. అప్పటి వరకూ… పోలీసుల తీరును సమర్థిస్తూ వచ్చిన పాలక పక్షం టీడీపీకి మాత్రం.. పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు అయిపోయారు. పోలీసుల తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసు అధికారుల సంఘం నేతలు.. తొడకొట్టి.. మీసాలు మెలేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. పోలీసుల వ్యవహారశైలి.. వారు.. వివిద కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై.. టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా.. పోలీసుల తీరు ఉండటంతో టీడీపీ నేతలు మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.
ఎవరు అధికారంలో ఉంటే.. పోలీసులు వారికి అనుకూలంగా వ్యవహరించడం.. చట్టం, న్యాయం గురించి పట్టించుకోకుండా.. కొందరికి మాత్రమే… చట్టాలు అమలు చేస్తూ.. అధికార పార్టీ నేతలు ఏం చేసినా… చూసీచూడనట్లు ఉండటంతోనే అసలు సమస్య వస్తోంది. పోలీసులు తమ విధి నిర్వహణను .. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తే.. ఈ సమస్య వచ్చేది కాదు. కానీ… పోస్టింగ్ ల కోసం.. ఇతర పనుల కోసం.. అధికార పార్టీతో సన్నిహితంగా మెలిగే అధికారులు.. అందలం ఎక్కిన తర్వాత .. కృతజ్ఞత చూపుతున్నారు. ఫలితంగా.. వివాదాలొస్తున్నాయి. పోలీసుల వ్యవహారశైలి రాజకీయం అయిపోతోంది.