మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన.. “మా”లో తగువులు మరోసారి రచ్చకెక్కాయి. కొద్ది రోజులుగా … కార్యవర్గం అంతా రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటూంటే.. కామ్‌గా ఉండలేక… గౌరవసలహాదారు హోదాలో… రెబల్ స్టార్ కృష్ణంరాజు… ఓ సమావేశం ఏర్పాటు చేశారు. మనసు విప్పి మాట్లాడుకుని.. అందరూ ఒకటయ్యేలా .. సమావేశం నిర్వహిద్దామని అనుకున్నారు. సమావేశానికి రెండు వర్గాలూ హాజరయ్యాయి. వారి ఉద్దేశం వేరు. రెండు వర్గాలు.. తమ తమ వాదనను.. మరింత బలంగా వినిపించి.. సమస్యను జఠిలం చేసేందుకు ప్రయత్నించారు తప్ప… సమస్యలు పరిష్కరించుకుందామన్న ఆలోచన చేయలేదు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో రాజశేఖర్ ఉన్నారు. వీరిద్దరూ ఒకే ప్యానల్ తరపున గెలుపొందారు. అయినప్పటికీ.. నరేష్ ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న ఆరోపణలపై… రాజశేఖర్ దూరం జరిగారు. ఆ దూరం.. అంతకంతకూ పెరిగిపోయింది. గతంలోనూ ఇలా రచ్చ జరిగితే.. మళ్లీ ఒకటయ్యామన్నట్లుగా.. ఓ సారి ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆలాంటిదేమీ లేదని.. తాజా సమావేశంలో వెల్లడయింది. నరేష్ అధ్యక్ష హోదాలో.. ఏ విషయాన్ని ఇతరులతో పంచుకోవడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో ఆర్థిక అవకతవకల అంశం తెరపైకి వస్తోంది.
ఈ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. `మా` ట్రెజరర్ పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుంటూ సమావేశం నుండి వెళ్లిపోయారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేయడంతోనే ఆయన మనస్థాపం చెంది .. కన్నీరు పెట్టుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పరుచూరి గోపాలకృష్ణతో పాటు.. మరికొంత మంది సభ్యులు కూడా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈసీ మెంబర్ గా ఉన్న నటుడు ఫృధ్వీ .. గోపాలకృష్ణకు అవమానం జరిగిందనిఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్‌లో కొందరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నారని, ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని పృథ్వీ మండిపడ్డారు. సభ్యులు ఏం మాట్లాడినా.. జీవిత రాజశేఖర్ తప్పుపడుతున్నారని ఆరోపించారు. గట్టిగా ఆరు వందల మంది సభ్యులు లేని అసోసియేషన్… వ్యవహారం.. ప్రతీసారి రచ్చకెక్కడం టాలీవుడ్ పెద్దలను సైతం.. చికాకు పరుస్తోంది.