ఆర్టీసీ సమ్మె అంశాన్ని రాజకీయంగా బాగా వినియోగించుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే కార్మికుల తరఫున జిల్లాల్లో పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇన్నాళ్లూ హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద ప్రధాన దృష్టి పెట్టిన ప్రముఖ నేతలు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. దాన్లో భాగంగా ఇవాళ్ల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ప్రగతి భవన్ కి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహిస్తున్నట్టు సమాచారం. వ్యూహమంతా ఆయనే సిద్ధం చేశారనీ, మల్కాజ్ గిరి నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తల్ని ప్రగతి భవన్ కు తరలించే ఏర్పాట్లు ఆయన చేశారని అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా ముందుగా రేవంత్ రెడ్డిని అదుపులో తీసుకునే ప్రయత్నాలూ మొదలైనట్టు సమాచారం. ఆ సంగతి తెలిసిన రేవంత్ జాగ్రత్తపడ్డారనీ అంటున్నారు! తన ఆచూకీని కొంత రహస్యంగా ఉంచారని సమాచారం. గతంలో ఓసారి… చలో ఉస్మానియా కార్యక్రమానికి ఇలానే రేవంత్ పిలుపునిచ్చిన సందర్భంలో ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, ఆయన ఎక్కడున్నారనేది పోలీసులకి తెలియలేదు. అనూహ్యంగా సభ జరిగే సమాయానికి ఉస్మానియా యూనివర్శిటీలోనే రేవంత్ రెడ్డి ప్రత్యక్షమైన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా అదే తరహాలో పోలీసులకు చిక్కకుండా ప్రగతి భవన్ ముట్టడి సమయానికి ఆయన వస్తారని అంటున్నారు.
అయితే, ఆర్టీసీ కార్మికుల సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని తమ స్వప్రయోజనాంశంగా మార్చేసుకుంటోందా..? అసెంబ్లీ లోపలా బయటా కేసీఆర్ తమ పట్ల వ్యవహరించిన తీరుకు బదులు చెప్పేందుకు అందివచ్చిన అవకాశంగా మాత్రమే దీన్ని చూస్తోందా అనే విమర్శలు కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశమూ కనిపిస్తోంది. కార్మికులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఫర్వాలేదు. కానీ, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా, తమ గొంతును వినిపించాలనే ఉద్దేశించే నిర్వహించే ప్రయత్నం ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. నిజానికి, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నమూ ప్రభుత్వం నుంచి బలంగానే ఉంటుంది. రేవంత్ రెడ్డితోపాటు, కాంగ్రెస్ నేతల్ని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తారనడంలోనూ సందేహం లేదు. చూడాలి… ఎవరి వ్యూహం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో?