కేసీఆర్ గోదావరి నీళ్లు ఇస్తున్నారు.. తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా బహిరంగంగా ప్రకటించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన చేయకపోయినా.. ప్రత్యామ్నాయంగా ఏపీ భూభాగంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించడమే దీనికి కారణం. పోలవరం నీటిని రాయలసీమకు తరలించేందుకు గత ప్రభుత్వం గోదావరి – కృష్ణా – పెన్నా అనుసంధాన ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ఓ ప్రణాళిక సిద్ధం చేసి.. పల్నాడులో.. అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. కొత్త ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు తరలించేందుకు… తెలంగాణతో కలిసి ప్రాజెక్ట్ కట్టే ఆలోచన చేయడంతో.. ఇక అనుసంధానం ఉండదనుకున్నారు. అయితే అనూహ్యంగా… కొత్త నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం విషయాన్ని జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. తెలంగాణ భూభాగం మీదుగా గోదావరి జలాలను నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి ఎత్తిపోయడం కన్నా.. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో ఎక్కువ ప్రయోజనమే అంచనాకు ఏపీ సీఎం వచ్చినట్లుగా భావిస్తున్నారు. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడ నుంచి శ్రీశైలం కుడి కాలువ ద్వారా బానకచర్ల వరకు తీసుకెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో అంచనాలు రూపొందించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్కు అప్పగించాలని నిర్దేశించారు. ఈ నివేదిక వచ్చాక కార్యాచరణకు దిగాలని సీఎం యోచిస్తున్నారు. అంతే కాదు.. దీనికి డిసెంబర్ 26వ తేదీన శంకుస్థాపన చేస్తారని.. సాక్షి పత్రిక కూడా ప్రకటించింది.
ఉమ్మడి ప్రాజెక్ట్ విషయంలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు ఎందుకు వేస్తున్నారనే చర్చ.. అధికారవర్గాల్లో సాగుతోంది. కేసీఆర్తో కలిసి నీటిని పంచుకుంటామని.. అదే పనిగా.. చెప్పిన జగన్.. ఒక్క సారిగా… విధానాన్ని మార్చుకోవడంపై… అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే.. ఉమ్మడి ప్రాజెక్టుపై.. జగన్ వెనుకడుగు వేయలేదని.. ఆ ప్రాజెక్టు కూడా ఉంటుందని… వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అలా అయితే.. రెండు రకాలుగా అనుసంధానం వల్ల ఉపయోగం ఏముంటుందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ఏది నిజమో. ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.