వివాదాస్పద స్వామిజీ దంపతులు కల్కిభగవాన్, అమ్మ భగవాన్లు ఎగ్గొట్టిన పన్నే రూ. 800 కోట్లు ఉంటుందని.. ఐటీ అధికారులు తేల్చారు. చిత్తూరు జిల్లా వరదలయ్యపాళ్యంలో ఉన్న ఆశ్రమాలతో పాటు తమిళనాడులో ఉన్న పలు ఆశ్రమాలు, ఆఫీసులను జల్లెడ పట్టిన తర్వాత ఈ లెక్క తేల్చారు. 5 రోజుల పాటు 40 చోట్ల కొనసాగిన సోదాల్లో రూ. 64 కోట్ల నగదు, 90 కిలోల బంగారం సీజ్ చేశారు. దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టినట్లుగా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 4 వేల ఎకరాల భూములు అక్రమంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మొత్తంగా లావాదేవీలపై రూ. 800 కోట్లకు పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
కల్కి భగవాన్, అమ్మభగవాన్ల ఆశ్రమలకు.. ఇతర స్వామిజీల ఆశ్రమాలకు వచ్చినట్లుగా పెద్దగా రాజకీయ నేతలు రారు. చాలా లోప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తూంటారు. అయితే రాజకీయ నాయకులతో సంబంధాలు లేకుండా ఉండవని అంచనా వేస్తున్నారు. వారి అండ లేకుండా.. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు, పెట్టుబడులు దేశం బయటకు తరలించడం… పన్నులు ఎగ్గొట్టడం సాధ్యం కాదనే వాదన ఉంది. వీరి ఆశ్రమ వ్యవహారాలు, ఆస్తులపై గతంలో ఎన్నో వివాదాలు వచ్చినప్పటికీ… మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ.. కొన్నాళ్లకే సద్దుమణిగిపోయేవి.. వారి వ్యవహారాలు మాత్రం నిరాటంకంగా సాగిపోయేవి. ఇప్పుడు.. ఆ పుట్ట బద్దలయింది.
భారీ కాంట్రాక్టులు చేసిన సంస్థలో.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పండిపోయిన వారో.. రాజకీయ నేతల బినామీ కంపెనీలో అయితే… ఇంత పెద్ద మొత్తంలో ధనం ఉంటే.. ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోరు. ప్రజాధనం.. ఆ రూపంలో అక్కడ పోగు పడిందని అనుకుంటారు. అయితే.. ఓ స్వామిజీ ఇంత పెద్ద మొత్తంలో ఎలా సంపాదించారనేది..చాలా మందికి తెలియని విషయం. భక్తులు ఇలా… తిరుపతి వెంకన్నకు ఇచ్చినట్లుగా.. లక్షలు,కోట్లు విరాళాలుగా ఇచ్చేంతగా కల్కి ప్రాచుర్యం పొందిన దాఖలాలు లేవు. భక్తుల్లో కొంత పలుకుబడి ఉన్నప్పటికీ.. అంత సొమ్ము విరాళాలుగా రావడం..సాధ్యమయ్యే పని కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయనేది…ఐటీ అధికారులు తేల్చాల్సి ఉంది.