హర్యానా, మహారాష్ట్రలో భాజపాకి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఎక్కడా గట్టి పోటీని ఇవ్వలేదనే అభిప్రాయమే అన్ని మాధ్యమాల ద్వారా వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కి ఎందుకీ పరిస్థితి వచ్చింది? లోక్ సభ ఎన్నికల వైఫల్యం తరువాత ఎందుకింతగా డీలాపడుతోంది? ఆ రెండు రాష్ట్రాల్లో మోడీ హవా ప్రభావం ఎక్కువ ఉందా, కాంగ్రెస్ వైఫల్యమే భాజపాకి ప్లస్ పాయింట్ గా మారుతోందా..? ఇప్పుడు ఇలాంటి చర్చ మళ్లీ తెర మీదికి వస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా ఎన్నికల నిర్వహణ మొదట్నుంచీ పగడ్బందీగానే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు… ఎన్నికలు వచ్చేనాటికి భాజపా మాత్రమే దిక్కు, దేశమంతా మోడీ మోడీ అంటోందనే హైప్ ని పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు. వీటిలో ఏ ఒక్క వ్యూహాన్ని కాంగ్రెస్ సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నం చెయ్యలేకపోయింది.
ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపం అనేది ముమ్మాటికీ వాస్తవం. లోక్ సభ ఎన్నికల తరువాత డీలాపడ్డ పార్టీని తాను నడిపించలేనంటూ రాహుల్ గాంధీ చేతులెత్తేయడంతో మరింత పతనం మొదలైంది. నిజానికి, ఒక నాయకుడిగా అలాంటి సందర్భంలో రాహుల్ బలంగా నిలబడాల్సింది. ఆయన్ని బతిమాలి విసుగుచెంది, చివరికి సోనియా గాంధీకి పార్టీ పగ్గాలను కట్టబెట్టారు. ఆమె నాయకత్వంలో జరిగిన ఎన్నికలు ఇవి. అంటే, రాబోయే ఫలితాలు ఎలా ఉన్నా అవి సోనియా గాంధీ నాయకత్వం వైఫల్యంగానే చెప్పాల్సి ఉంటుంది. వయోభారంతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని ప్రశాంతంగా ఉందామనుకున్న సోనియాని, బలవంతంగా తీసుకొచ్చి బాధ్యతలు అప్పగించారు. ఆమెని తీసుకొస్తే చాలు, పనైపోయింది అన్నట్టుగానే కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహాలుగానీ, బలమైన పోటీని ఇచ్చే గట్టి ప్రయత్నాలుగానీ కాంగ్రెస్ అధినాయత్వం చెయ్యలేదని విమర్శలు మొదలైపోయాయి.
కాంగ్రెస్ పార్టీ తీరు చేస్తుంటే.. రానురాను గతవైభవాన్ని పూర్తిస్థాయిలో కోల్పోయే దిశగా అడుగులు వేస్తోంది. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, గాంధీ నెహ్రూలు ఒకప్పుడు ఉన్న పార్టీ అంటూ చేసుకునే ప్రచారానికి కాలం చెల్లబోతున్నట్టుగా ఉంది. ఇంకోపక్క.. భాజపా కూడా పటేల్ తోపాటు గాంధీ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్నది తాము మాత్రమే అని ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ లో సంక్షోభం కుటుంబ సమస్యగానే ఆ పార్టీ అధినాయకత్వం చూస్తున్నట్టుగా ఉంది. రెండు రాష్ట్రాల్లో పనితీరును ఆత్మవిమర్శ చేసుకున్నాకనైనా కాంగ్రెస్ తీరులో సమూల మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తోంది.