సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నిన్నంతా.. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ.. అమిత్ షా కార్యాలయం నుంచి జగన్‌కు ఫోన్ రాలేదు. ఈ రోజు ఉదయమే.. అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో.. జగన్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. దాదాపు నలభై నిమిషాల పాటు.. అమిత్ షాతో.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. విభజన చట్టంలో అమలు చేయాల్సిన అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితోనూ.. జగన్ సమావేశమవుతారు.
పది రోజుల కిందట.. జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీతో పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో… మోడీ కంటే ముందుగానే… అమిత్ షాతో అపాయింట్‌మెంట్ ఖరారయింది. కానీ.. చివరి క్షణంలో రద్దవడంతో.. మోడీతో సమావేశమై… నేరుగా అమరావతి వచ్చేశారు. ఆ తర్వాత నాలుగైదు రోజులకే.. మరోసారి అమిత్ షా కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ ఖరారైనట్లుగా సమాచారం వచ్చింది. ఢిల్లీ బయలుదేరే సమయానికి.. అది కూడా క్యాన్సిల్ అయింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉండటంతో క్యాన్సిల్ అయిందని చెప్పుకున్నారు. ఎన్నికల హడావుడి ముగియడంతో.. అమిత్ షాకు తీరుబడి ఉంటుందన్న ఉద్దేశంతో జగన్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం.. వివిధ కారణాలతో కలవలేకపోయినా.. మంగళవారం ఉదయాన్నే.. భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో… వాటిపై.. అమిత్ షాతో మాట్లాడాలని మోడీ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే.. అమిత్ షాతో భేటీ కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నించారని చెబుతున్నారు. విభజన చట్టం గురించిన అంశాలు ప్రధానంగా.. కేంద్రహోంమంత్రి చేతుల్లోనే ఉంటాయి. అంతే కాకుండా.. ఏపీకి రావాల్సిన నిధులు.. ఇతర అవసరాలు ఏమైనా.. మొదటి నుంచి అమిత్ షా చూస్తూంటారు. గత ప్రభుత్వంలో .. మంత్రిగా లేకపోయినప్పటికీ.. అమిత్ షా.. ఏపీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పుడు కూడా.. అమిత్ షా సూచనలు ఇస్తేనే.. ఏపీకి నిధులు, ప్రాజెక్టులు విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే.. జగన్.. అమిత్ షాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.