ఆర్టీసీతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. కార్మికుల 21 డిమాండ్లపై పరిశీలించేందుకు సంస్థ ఈడీతో ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ రెండు లేదా మూడు రోజుల్లో నివేదికను సిద్ధం చేసి ఆర్టీసీ ఎండీకి సమర్పిస్తుందనీ, ఆ వివరాలతో హైకోర్టుకు కూడా నివేదిక తయారు చేసి అందిస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే, కోర్టులో తమ వాదనను బలంగా వినిపించేందుకే కేసీఆర్ సర్కారు సిద్ధమౌతోంది. కార్మికులతో చర్చలు అనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఈ కమిటీ 21 డిమాండ్లపై నివేదిక సిద్ధం చేస్తుందని ప్రభుత్వం అంటోంది. కానీ, ఈ డిమాండ్లలో కార్మికుల ప్రధానంగా కోరుతున్న విలీనం అంశం పరిశీలనలో ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటున్నారంటే… కోర్టులో కార్మిక సంఘాల తరఫున వాదించిన న్యాయవాది కూడా ఆర్టీసీ విలీనం డిమాండ్ ను ప్రధానంగా ప్రస్థావించలేదనీ, అదొక్కటే ప్రధానమైంది కాదని అన్నారని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల్లో ఇదే అంశం ఉందన్నారు. దీంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను కార్మికులు వదులుకున్నట్టుగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో అభిప్రాయపడ్డారు. ఈ అంశమై ప్రభుత్వాన్ని పట్టుబట్టమనేది కార్మికుల అభిప్రాయంగా కనిపిస్తోందన్నారు. సమ్మె చట్ట వ్యతిరేకమనీ, దీనికి కాంగ్రెస్ భాజపాలు మద్దతు ఇవ్వడం అనైతికమన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తి అధికారం ఉందని మోడీ సర్కారే చట్టం తెచ్చిందన్ననారు. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఇక్కడ రాద్దాంతం చేస్తోందని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన విలీనాన్ని ముందుగానే పక్కన పెట్టేస్తున్నారు కేసీఆర్! అంతేకాదు, కార్మికులు కూడా దీన్ని వదులుకున్నారని ఆయనే ముందుగా ప్రిపేర్ చేసేస్తున్నారు. అంటే, విలీనం ఆలోచనను కార్మికులు వదులుకోవాలన్నదే కేసీఆర్ మాటగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర ఆర్టీసీని పెట్టుకునే ఉద్దేశం ఆయనకి ఉన్నట్టు లేదు. తాత్కాలింగా ఏవైనా ఉపశమన చర్యలు చేపట్టి, ప్రైవేటుపరం చేసి తీరతామన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే, ఆర్టీసీపై రాష్ట్రానికి ఉన్న హక్కుల్ని గుర్తుచేస్తున్నట్టుగా ఉంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కమిటీ అంటున్నారు. ఆ కమిటీ తన పని ప్రారంభించడానికి ముందే… ప్రధాన డిమాండ్ పై చర్చ ఉండదనే సంకేతాలు ఆయనే ఇచ్చేస్తున్నారు.