ఓ సినిమాలో బ్రహ్మానందం ఓ చానల్ క్రియేటివ్ హెడ్‌గా ఉంటారు. ఆయన క్రియేటివ్ ఆలోచలన్నీ అతిగా ఉంటాయి. అలా చెబితే..” ఐ వాంట్ దిస్ అతి “.. అంటూ చెలరేగిపోతూంటారు. ఇలాంటి “ఐ వాంట్ దిస్ అతి “.. క్యారెక్టర్లు టీవీ9లో ఎక్కువైపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి.. దీపావళి సందర్భంగా.. టపాసులు కాల్చొద్దంటూ.. విడుదల చేసిన ప్రోమోనే ఉదాహరణ. కిషోర్ దాస్‌ను పెట్టి షూట్ చేసిన ఈ ప్రోమోలో.. టపాసులు కాల్చేవాళ్లు గాడిదలన్నట్లుగా తీర్పిచ్చేశారు. కట్నం అడిగేవాడు గాడిద అని టీవీ9 … తన న్యూస్ లోగోల్లోనే వేస్తూంటారు. దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లి.. టపాసులు కాల్చేవాళ్లు గాడిదలని చెప్పేశారు. ఈ ప్రోమో అలా ఎయిర్ అయిందో లేదో.. ఇలా రియాక్షన్ వచ్చేసింది.
హిందువుల మనోభావాలతో టీవీ9 యాజమాన్యం ఆటలాడుతోందని.. సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. హిందూ వ్యతిరేక చానల్ అనే ముద్ర వేసి.. కొంత మంది తిట్లు లంకించుకుంటున్నారు. సమాజాన్ని పొల్యూట్ చేస్తున్న టీవీ9నే అతి పెద్ద గాడిదంటూ.. మరికొంత మంది రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత.. టీవీ9లో ” అతి ” క్రియేటివ్ పర్సన్స్‌కి బల్బ్ వెలిగినట్లుగా ఉంది. ఇతర బాధ్యతల్లో ఉన్న వాళ్లు కూడా కల్పించుకుని అప్పటికప్పుడు ప్రోమోని నిలిపివేయమని ఆదేశించారు. కానీ.. ఒక్క సారి గాల్లోకి పోయిన తర్వాత… డిలీట్ చేసినంతనే కనిపించకుండా పోదు. అప్పటికే డౌన్లోడ్లు అయ్యాయి. దాంతో… ఆ ప్రోమో అలా సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది.
ఈ ప్రోమోను చూపించి హిందూ వ్యతిరేక చానల్‌గా.. టీవీ9ను అందరూ.. విమర్శిస్తూండటంతో.. కొత్త యాజమాన్యం.. కొత్త బాధ్యతల్లో చేరిన వారు.. హుటాహుటిన స్పందించి… తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ సంప్రదాయాల పట్ల.. టీవీ9కి ఎంతో గౌరవం ఉందని ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతున్నారు. కానీ.. ఇలా క్షమాపణలు చెప్పడం వల్ల.. ఆ ప్రోమో మరింత వైరల్ గా మారింది. అతి కోరుకునే క్రియేటర్లు ఎక్కువైనప్పుడు.. ఇలాంటి చిక్కులే వస్తూంటాయి. పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. ..!