కర్నూలు ఎస్పీ వ్యక్తిగతంగా తీసుకుని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేం మర్చిపోం. అంతకంతకూ బదులు తీర్చుకుంటాం..! ..అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. దీనికి కారణం… అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ను.. పోలీసులు వెంటాడుతూండటమే. పట్టుకోవాలంటే… పెద్ద విషయం కాదు. కానీ.. అటు భార్గవరామ్‌ను పోలీసులు పట్టుకోరు.. కానీ.. ఆయన ఎక్కడికి వెళ్తే.. అక్కడకు వెళ్లి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా.. పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఇదంతా.. భూమా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఆడుతున్న మైండ్ గేమ్ అన్న ప్రచారం జరుగుతోంది. ఎస్పీ కావాలనే చేస్తున్నారని..భూమా అఖిలప్రియ అనుమానిస్తున్నారు. అవే ఆరోపణలు చేస్తున్నారు.
అఖిలప్రియ ఇప్పుడు యూరేనియం తవ్వకాలపై పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఆళ్లగడ్డలో యూరేనియం తవ్వకాలు జరుగుతూంటే.. ఆమె అడ్డుకున్నారు. ఆళ్లగడ్డను మరో పులివెందుల కానివ్వబోనంటూ.. చాలెంజ్ చేశారు. పులివెందులకు వెళ్లివచ్చారు. అక్కడ యూరేనియం ఫ్యాక్టరీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని… గమనించి వచ్చారు. ఆ తర్వాత నుంచే తనపై కేసులు మరింత యాక్టివ్ అయ్యాయని ఆమె అంటున్నారు. యురేనియం డ్రిల్లింగ్ పనులు ఆగినప్పటి నుంచి ఆళ్లగడ్డలో రాజకీయం ఊపందుకుంది. అఖిలపక్షం నేతల్ని ఏకంచేసి మరింత దూకుడు పెంచారు భూమా అఖిలప్రియ. జిల్లా టీడీపీ ముఖ్యనేతలు సైతం అఖిలప్రియకు అండగా నిలిచారు. “సేవ్ నల్లమల… సేవ్ ఆళ్లగడ్డ” అనే నినాదంతో అఖిలప్రియ ప్రజల్లోకి వెళ్తున్నారు.
భార్గవరామ్‌పై కేసులు పెట్టడం… అఖిలప్రియను.. రాజకీయంగా చురుకుగా ఉండకుండా చేసేందుకేనని భూమా వర్గం అనుమానిస్తోంది. ప్రజాపోరాటంలో ఇలాంటివి సహజం.. కేసులకు భయపడొద్దు.. తాను ఉన్నానని అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భార్గవ్‌రామ్ అజ్ఞాతం ఉన్నారు. త్వరలో పోలీసులకు లొంగిపోతారని చెబుతున్నారు. ఆ తర్వాత అఖిలప్రియ మరింత దూకుడుగా రాజకీయం చేస్తారని.. దాంతో కర్నూలు రాజకీయం ముఖ్యంగా ఆళ్లగడ్డలో పరిస్థితి మారుతుందన్న చర్చ నడుస్తోంది.