`ఇస్మార్ట్ శంకర్`తో పూరి జగన్నాథ్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు తన దృష్టంతా విజయ్ దేవరకొండ సినిమాపైనే ఉంది. విజయ్‌ని పూరి ‘ఫైటర్’గా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. 2020 ప్రధమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా కథానాయిక ని ఖరారు చేసుకునే పనిలో పడ్డాడు పూరి. సాధారణంగా కొత్త హీరోయిన్లతో సర్దుకుపోతుంటాడు పూరి. `ఇస్మార్ట్ శంకర్`లో నటించిన నిధి అగర్వాల్, నభా నటేషా దాదాపుగా కొత్తవాళ్లే. ఈ సినిమాతో స్టార్ హోదా వచ్చేసింది. అందుకే ఈసారీ కొత్తవాళ్లనే తీసుకుంటాడనుకున్నారు. లేదంటే ఇస్మార్ట్ హీరోయిన్లలో ఒకరిని ఖరారు చేస్తాడనుకున్నారు. కానీ.. పూరి ఆలోచన వేరు. ఈ సినిమాకి క్రేజీ కాంబోని సెట్ చేసే పనిలో ఉన్నాడు.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని హీరోయిన్గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు పూరి. జాన్వీ – విజయ్ జోడీ అయితే… కాంబినేషన్ పరంగానూ ఈ సినిమాకి క్రేజ్ వస్తుందన్నది పూరి ఆలోచన. జాన్వీని తెలుగులోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏదీ కుదర్లేదు. ఈసారి మాత్రం ఈ కాంబో పక్కా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబోపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.