మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై, ఇటు విమర్శకుల ప్రశంసలతో పాటు అటు ప్రేక్షకుల నుండి జేజేలు పలికించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు నాట బ్రిటిష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నరసింహారెడ్డి నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు సంపాదించుకోకపోయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో మాత్రం రికార్డు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవికీ ఈనెల 24వ తేదీన ప్రధాన మంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
రాజకీయ నాయకుల ప్రశంసల్ని పొందుతున్న సైరా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సినిమా ని రాజకీయ ప్రముఖులకు ప్రదర్శించేలా చిరంజీవి చొరవ చూపిస్తూ వచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై ఈ సినిమా చూసి, ప్రతి భారతీయుడు చూసి తీరాల్సిన సినిమా అని కొనియాడిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ని చిరంజీవి కలవడం, ఆ సందర్భంగా జగన్ కూడా చిరంజీవి మీద, ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో ఆయనకు ప్రత్యేక ప్రదర్శన చిరంజీవి ఏర్పాటు చేయగా, సినిమా చూసిన వెంకయ్య నాయుడు, తెలుగు తెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ లేని లోటును చిరంజీవి తీరుస్తున్నారని, సైరా నరసింహారెడ్డి సినిమా అద్భుతంగా తెరకెక్కిందని ప్రశంసించారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు కావడంతో అప్పట్లో చూడలేకపోయిన ప్రధాని:
ఇదే కోవలో దేశ ప్రధాని మోడీ కి సైతం ఈ సినిమా చూపించాలని చిరంజీవి ప్రయత్నించగా, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో ఎన్నికలు ఉండడంతో, ఎన్నికల అనంతరం కలవాల్సిందిగా ప్రధాని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయం నుండి చిరంజీవికి ఫోన్ వచ్చినట్లు, నిర్మాత రామ్ చరణ్ సహా ఈనెల 24వ తేదీన మోడీని కలవడానికి రావాల్సిందిగా సూచించినట్లు సమాచారం. దీంతో రేపు మోడీని కలవడానికి, ఈ సినిమాను చూపించడానికి చిరంజీవి సమాయత్త మవుతున్నారు.
కలెక్షన్లపై ప్రభావం చూపకపోవచ్చు:
అయితే ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమా రన్ దాదాపు గా పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంత రన్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో సినిమా రన్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. అయితే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ ఈ సినిమా కలెక్షన్ల గురించి ఇప్పటి వరకు అధికారికంగా మాట్లాడలేదు. పైగా, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్వతంత్ర సమరయోధుడి సినిమా విషయంలో కలెక్షన్ల గురించి మాట్లాడకూడదు అని తాము నియమం పెట్టుకున్నామని చిరంజీవి, రామ్ చరణ్ మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. ప్రధాని మోడీ కి ఈ సినిమా చూపించడం వల్ల కలెక్షన్ల విషయంలో ప్రయోజనం లేకపోయినప్పటికీ, ఒక తెలుగు యోధుడి పోరాటాన్ని ప్రధానికి, తద్వారా దేశం మొత్తానికి తెలిసే అవకాశం ఉంది.
రాజకీయ సమీకరణాలకు, రాజకీయ చర్చకు అవకాశం ఉందా?
చిరంజీవి కి ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఫోన్ రావడంతో, ఈ అపాయింట్మెంట్ కేవలం సినిమాకు పరిమితం అవుతుందా లేక రాజకీయ సమీకరణాలకు, రాజకీయ చర్చలకు దారి తీస్తుందా అన్న చర్చ మొదలైంది. బిజెపి వ్యూహ కర్త రామ్ మాధవ్ కొద్ది నెలల కిందట చిరంజీవిని కలిసి బిజెపి లోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి తన ఫోకస్ ప్రస్తుతానికి సినిమాల మీదే ఉందని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని చూస్తున్న బిజెపి, రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గానికి దగ్గరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చిరంజీవిని బిజెపి లో చేర్చుకోవడానికి, జనసేన ను విలీనం చేసుకోవడానికి గతంలో బిజెపి పలుమార్లు ప్రయత్నించింది. అయితే ఇప్పుడు సైరా సినిమా చూపే సందర్భంగా ప్రధానితో సన్నిహితంగా చర్చించే అవకాశం చిరంజీవికి లభించనుంది. మరి ఈ భేటీలో అటువంటి చర్చకు ఆస్కారం ఉందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
మొత్తానికి రేపు ప్రధాని సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడతారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది.