జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ..తన వైఫల్యాలను బీజేపీపై నెట్టడానికి చేసిన ప్రయత్నమా..? కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని గతంలో చంద్రబాబు చేసినట్లుగా ప్రచారం చేసుకునే ప్రయత్నమా..? అవునని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. హోంమంత్రి అపాయింట్ మెంట్ ఖరారు కాకుండానే ఢిల్లీకి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి … అందుబాటులో ఉన్నప్పటికీ.. తనకు సమయం ఇవ్వలేదని ప్రచారం చేయించుకున్నారు. ఆ తర్వాత అమిత్ షాకు.. ఏపీకి సంబంధించిన అన్ని అంశాలపై వివరించామని.. సానుకూలంగా స్పందించారని మీడియాకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఎన్నెన్నో ఇవ్వాలన్నట్లుగా…జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం… అవన్నీ ఇవ్వడం లేదన్నట్లుగా జగన్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో బీజేపీ నేతలు అలర్టయ్యారు.
ఎంపీ సుజనా చౌదరి వెంటనే స్పందించారు. జగన్ ఢిల్లీ యాత్ర చేసి బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక విధానమే కాదని.. ఏ ఒక్క విధానమూ సక్రమంగా లేదని మండిపడ్డారు. అవినీతి ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదన్నారు. ఓ వైపు.. జగన్మోహన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వైసీపీ ఈ ప్రచారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటోందని… బీజేపీ నేతలకు అర్థం అయింది.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా.. ఏం వినతి పత్రాలు ఇస్తున్నారో కానీ.. అధికారిక ప్రకటనలు మాత్రం చేయడం లేదు. వారికిచ్చిన వినతి పత్రాలను విడుదల చేయడం లేదు. కానీ.. మీడియాకు ఇచ్చే సమాచారంలో మాత్రం.. గతంలో.. చంద్రబాబు ఎన్ని డిమాండ్లు కేంద్రం ముందు పెట్టేవారో.. అవన్నీ ఉంటున్నాయి. అప్పట్లాగే కేంద్రం ఏమీ చేయడం లేదన్న అభిప్రాయాన్ని… మాత్రం వైసీపీ అధినేత కల్పిస్తున్నారు. బీజేపీని ప్రజల్లో విలన్ చేసేందుకు వైసీపీ కూడా చంద్రబాబు బాటలో వెళ్తోందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు.