ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదున్న కేసులను ప్రధానంగా ప్రముఖంగా ప్రస్థావించి ఘాటైన విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రకాశం జిల్లాలో రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ… సీఎం జగన్ తాజా ఢిల్లీ పర్యటనను ప్రస్థావించారు. మన నాయకులు ఢిల్లీ వెళ్తే అక్కడ హోంమంత్రి అమిత్ షా ఇంటర్వ్యూ దొరకలేదు, రవిశంకర్ ప్రసాద్ ఇంటర్వ్యూ దొరకలేదు.. ఇలాంటివి వినిపించాయన్నారు. మన మీద కేసులున్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడటానికి ధైర్యం సరిపోదన్నారు! ఏదైనా మాట్లాడితే సీబీఐ కేసుల్ని పెద్దవాళ్లు ప్రస్థావిస్తే లొంగిపోవాల్సి వస్తుందన్నారు. నా మీద కేసులున్నప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేననీ, అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులైతే ఎంత న్యాయం జరుగుతుందీ అనేది తనకు సందేహమే అన్నారు.
శాంతిభద్రతలు, చట్టాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు… సొంత చిన్నాన్నని దారుణంగా మెడకోసి చంపేస్తే, అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయించిందని విమర్శించినవారు ఇప్పుడేమయ్యారన్నారు. కోడి కత్తితో దాడి చేయించారు నామీద అంటూ, ఆంధ్రా పోలీసుల మీద నాకు నమ్మకం లేదంటూ సీబీఐ విచారణ జరిపించాలని అన్నది వారే అన్నారు పవన్. ఇవాళ్ల ఆయనే కదా ముఖ్యమంత్రి, వాళ్ల పార్టీయే కదా అధికారంలో ఉందీ, విచారణ జరిపించొచ్చు కదా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయినంత మాత్రాన ఆ కేసుల్ని కన్వీనియంట్ గా మర్చిపోయేరు అన్నారు. మనం ఎన్నుకునే వ్యక్తులు నేరాలతో, ఆర్థిక నేరాల్లో ఉన్నవాళ్లు అయితే… ఈరోజున మనం భయంలో అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. నేను చాలామంది ప్రజల్లాగ పిరికితనంతో బతకడానికి సిద్ధంగా లేనని, గెలవడం కోసం గడ్డి తినేస్తామా అంటూ వ్యాఖ్యానించారు.
కోడికత్తి కేసు, వైయస్ వివేకా హత్య కేసు… ఈ రెండూ ఎన్నికల ముందు తీవ్ర కలకలం సృష్టించినవి. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా ఈ కేసుల్ని టీడీపీ కుట్రలుగానే అభివర్ణించింది. అధికారంలోకి వచ్చాక ఆ కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఇప్పుడు టీడీపీ కూడా ఘాటుగా మాట్లాడటం లేదు! కానీ, పవన్ చాలా ఘాటుగా స్పందించారని చెప్పాలి. చాలామంది ప్రజల్లాగ…. అంటూ గత ఎన్నికల్లో తీర్పుపై ఎక్కడో ఏమూలో తనలో ఉన్న అసహనాన్ని కూడా పవన్ మెల్లగా బయటపెట్టారని చెప్పుకోవచ్చు.