తెలంగాణలో ఎప్పటికప్పుడు ఎన్నికల హడావుడే ఉంటుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు మొదలుపెట్టి, తాజా హుజూర్ నగర్ ఉప ఎన్నిక వరకూ రాజకీయ పార్టీలన్నీ ఏదో ఒక ఎన్నికతో బిజీగా ఉంటూ వస్తున్నాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమౌతోంది. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధమౌతోంది. ఇదే అంశాన్ని ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ఇదే అంశాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు నిర్వహిచేందుకు సిద్ధపడ్డా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికలు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో కూడా సీఎం చర్చించారు.
అధికార పార్టీ తెరాస మున్సిల్ ఎన్నికలకు ఎప్పట్నుంచో సిద్ధంగా ఉంది. జిల్లా పరిషత్ లు మాదిరిగానే ఘన విజయం సాధించాలనే వ్యూహాలతో సిద్ధమౌతోంది. ఇక, కాంగ్రెస్, భాజపాల పరిస్థితి ఏంటనేది తేలాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వస్తుంది. తేడా వస్తే, మరింత నైరాశ్యం తప్పదు. ఇదే తెరాసకు మంచి ప్రచారాస్త్రం అవుతుంది. అయితే, తెరాసపై వ్యతిరేకత పట్టణ ప్రజల్లో బాగా ఉందనీ, అది తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ముందు నుంచీ చెబుతున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై భాజపా చాలా ఆశలు పెట్టుకుంది. పార్టీ ఉనికి చాటుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తోంది. పట్టణ ప్రాంత యువత తమవైపు మొగ్గు చూపుతారనే ఆశతో ఉంది. నంబర్ టు స్థానంలో తాము ఉన్నామని నిరూపించుకుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెరాసకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి వస్తామనేది వారి వ్యూహం. ఇక, రాష్ట్రంలో లేదూ కాదూ అయిపోయిందీ అనుకున్న తెలుగుదేశం పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగే అవకాశాలూ లేకపోలేదు. హుజూర్ నగర్ ఎన్నికల్లో అనూహ్యంగా అభ్యర్థిని బరిలోకి దింపింది. పార్టీని మరోసారి బలోపేతం చేసుకోవాలనే ఆలోచన మొదలైంది కాబట్టి, మున్సిపోల్స్ లో మరోసారి సొంతంగా బరిలో దిగే అవకాశం ఉంది. అయితే, ఈ పార్టీలన్నింటి ముందున్న అసలు సవాల్ ఏంటంటే… అధికార పార్టీ ఉద్ధృత ప్రచారాన్ని, దూకుడు వ్యూహాన్ని తట్టుకోవడం. క్షేత్రస్థాయిలో పకడ్బందీ వ్యూహంతో తెరాస దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీన్ని అర్థం చేసుకుని, సొంత వ్యూహాలపై ప్రతిపక్ష పార్టీలు ముందు నుంచే సిద్ధమవ్వాలి. అంతర్గత కలహాలతో కాంగ్రెస్, మనుగడ కోసం పోరాడుతున్న టీడీపీ, సరైన కేడర్ లేని భాజపా… ఈ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కొంటాయో చూడాలి.