అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ… ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వర్తింప చేసింది. అయినా మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మాత్రం.. పూర్వ వైభవం రావట్లేదు. మాజీ అర్చకుల్ని మళ్లీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని. టీటీడీ బోర్డు స్పష్టమైన ప్రకటన చేసింది. రమణదీక్షితులు రిటైర్మెంట్ కావడానికి రాజకీయ ఆరోపణలు చేయడమే. ఎవరి కోసం ఆయన ఈ పని చేశారో.. వారే అధికారంలోకి వచ్చినా.. పోయిన ఆయన పదవి మాత్రం రావడం లేదు. శ్రీవారి ఆలయంలోకి మళ్లీ ప్రధాన అర్చకుడిగా రావాలని రమణదీక్షితులు జగన్ని నమ్ముకుని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బోర్డు మీటింగ్ లో రమణదీక్షితులు అంశాన్ని లైట్ తీసుకున్నారు. ప్రధానార్చకునిగా.. తిరుగులేని స్థానంలో ఉన్న సమయంలో.. ప్రభుత్వంపై.. విమర్శలు చేసిన.. దీక్షితులకు అప్పటి ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. అయితే.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ గెలిచిన వెంటనే రమణదీక్షితులు వెళ్లి.. ఇడుపులపాయలో జగన్ ను కలిశారు. ఆయన కూడా భరోసా ఇచ్చి పంపారు. కానీ హామీ మాత్రం నెరవేరలేదు. రమణదీక్షితులను మళ్లీ.. ఆయన ప్రధాన అర్చకుడ్ని చేస్తామని గతంలో వైసీపీ ప్రకటించింది. భూమన కరుణాకర్ రెడ్డిసహా పలువురు నేతలు ఈ మేరకు బహిరంగ ప్రకటనలు చేశారు.
ఇటీవల రెండు, మూడు సార్లు జగన్ ను రమణదీక్షితులు కలిశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చిన్న జీవో జారీ చేసినా.. పనైపోతుందని.. కానీ చేయడం లేదని… రమణదీక్షితులు ఆవేదనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రమణదీక్షితులను తొలగించిన తరువాత ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించింది అప్పటి ప్రభుత్వం. ఖాళీగా వున్న అర్చక పోస్టులలో కూడా మీరాశి వంశీకులను అర్హత పరిక్ష ఆధారంగా నియమించేశారు. రమణదీక్షితులతో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు ప్రధాన అర్చకులను తిరిగి టీటీడీలోకి తీసుకరావాలి అంటే మరో నలుగుర్ని తొలగించాలి. అలా తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయి. అందుకే మాజీ అర్చకుల్ని తీసుకునే అవకాశం లేదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది.