కౌంటింగ్ ప్రారంభం కాగానే…మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమికి 150 సీట్లు, హర్యానాలో బీజేపీకి 60 సీట్లు వేసేశాయి… తెలుగు టీవీ చానళ్లు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాలు ఉంటాయని ఊహించుకుని.. ఆ ప్రకారం.. ఆలస్యం ఎందుకని.. కౌంటింగ్ ప్రారంభించగానే… స్కోర్ బోర్డును… తమ ఊహాలతోనే ప్రారంభించాయి. నిజానికి.. ఈ టీవీ చానళ్లకు.. ఢిల్లీలో ఒకే ఒక్క రిపోర్టర్ ఉంటాడు. ఇతర రాష్ట్రాల్లో ఉండనే ఉండరు. మహారాష్ట్రలో ఒకటి రెండు చానళ్లకు రిపోర్టర్లు ఉన్నా.. వాళ్లు పేరుకే.. పట్టించుకునేవారు కూడా ఉండరు. తెలుగు టీవీ చానళ్లకు ఉండే సోర్స్ మొత్తం జాతీయ మీడియా చానళ్లే. అయితే.. ఈ సారి తాము జాతీయ మీడియా కన్నా గొప్ప అని చెప్పాలనుకున్నారో ఏమో కానీ… ఇష్టమొచ్చిన అంకెలు వేసుకుంటూ.. బీజేపీ కూటమికి వీరతాళ్లు వేస్తూ వెళ్లిపోయారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ కూటమి… కాంగ్రెస్ కూటమి కంటే ముందు ఉన్నప్పటికీ.. కౌంటింగ్ జరిగే వరకూ.. టీవీ చానళ్లు ఆగలేకపోయాయి. కౌంటింగ్ లో… అంత ఏకపక్షంగా ఫలితాలు లేవని మాత్రం తేలిపోయింది. మహారాష్ట్రలో.. బీజేపీ కూటమి.. బొటాబొటి మెజార్టీ మాత్రమే వస్తుందని.. రెండు గంటల కౌంటింగ్ ట్రెండ్స్ చూస్తే.. అందరికీ అర్థమైపోతుంది. కానీ అంత కంటే మూడు గంటల ముందే.. తెలుగు టీవీ చానళ్లు… బీజేపీ కూటమి 160 నుంచి 200 సీట్లు వేస్తూ.. స్కోర్ బోర్డులు వేశాయి. తర్వాత తగ్గించుకుంటూ వచ్చాయి. హర్యానాలోనూ అదే పరిస్థితి. అక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీకి అవసరమైన 46 స్థానాలు కష్టమని.. ఇతరులపై ఆధారపకడ తప్పదన్న ట్రెండ్స్ కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత తేలింది. కానీ.. అంతకు ముందు హర్యానాలో బీజేపీ ప్రభంజనం అంటూ… మీడియా ఉదరగొట్టేసింది.
అత్యుత్సాహానికి.. అవాస్తవాల ప్రచారానికి తెలుగు మీడియా పెట్టింది పేరుగా మారుతోంది. వార్తలు… ఇతర విషయాలు ఎప్పటికప్పుడు బయాస్ చేస్తున్నట్లుగా.. ఎన్నికల ఫలితాల విషయంలోనూ బయాస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితాలను మార్చలేరని… గుర్తించలేకపోతున్నారు. ఫలితాల్లోనూ ఊహాలు ప్రసారం చేస్తే.. కామెడీ అయిపోతుంది. కౌంటింగ్ లో బయటపడిన విషయాన్ని చెబితేనే… విశ్వసనీయత ఉంటుంది. ఆ నమ్మకాన్ని తెలుగు మీడియా పోగొట్టుకుంటోంది.