కప్పు కాఫీ కూడా దొరకడం లేదు. ప్రభుత్వం కనీస ఏర్పాట్లు కూడా చేయదా..? .. ఈ ఆవేదన సాదాసీదా వ్యక్తిది కాదు. హైకోర్టు చీఫ్ జస్టిస్దే. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ది. అమరావతి స్విస్ చాలెంజ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై నాలుగు వారాల పాటు ప్రభుత్వ న్యాయవాది వాయిదా కోరారు. ఈ మేరకు కేసు వాయిదా పేసిన తర్వాత … హైకోర్టులో ఏర్పాట్లపై చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జడ్జిలకు క్వార్టర్లు కూడా లేవని ప్రభుత్వ న్యాయవాదిపై మండిపడ్డారు. న్యాయవాదులకు కూడా సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. కప్పు కాఫీ కూడా దొరకడం లేదని … ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందా? లేదా? వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని…ప్రభుత్వ న్యాయవాదిని చీఫ్ జస్టిస్ కోరారు. చీఫ్ జస్టిస్ అనూహ్యంగా.. హైకోర్టులో ఏర్పాట్లపై నిలదీయడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది షాక్ కు గురయ్యారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి ఇటీవలే… నియమితులయ్యారు. గత ప్రభుత్వం హైకోర్టును ఏపీకి తరలించి… న్యాయమూర్తులు, ఇతర అధికారులకు తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. వారి కోసం… క్వార్టర్లను శరవేగంగా నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ పనులు… మధ్యలో ఉండగానే ఎన్నికలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి రావడంతో.. జడ్జి క్వార్టర్ల నిర్మాణాలను కూడా నిలిపివేశారు. ఐదు నెలలు ముగిసినా వాటిలో పురోగతి లేదు. మరో వైపు న్యాయమూర్తులు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టులో గత ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు కూడా… అంతకంతకూ తగ్గిపోయాయి. చివరికి సరైన క్యాంటీన్ వ్యవస్థ కూడా లేకుండా పోయింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన జస్టిస్ జేకే మహేశ్వరికి ఈ పరిస్థితి ఆగ్రహం తెప్పించింది.
హైకోర్టుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హైకోర్టు వర్గాలు పలుమార్లు… మౌలిక సదుపాయాల అంశంపై.. ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ… ఫలితం లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే చీఫ్ జస్టిస్ ప్రభుత్వ న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేశారంటున్నారు. మరి సర్కార్ ఇప్పటికైనా… హైకోర్టుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తుందో లేదో మరి..!