మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ టీవీచానల్స్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ చిలకజోస్యాలేనని తేలింది. ఏ ఒక్క సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్ కూడా… ఫలితాలకు దరిదాపుల్లో లేవు. ముఖ్యంగా హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఖాయమని… పేరు గొప్ప చానళ్లన్నీ.. అంత కంటే గొప్ప …సర్వే సంస్థలుగా పేరు తెచ్చుకున్న వాటితో కలిసి చేసిన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 70కి తగ్గబోవని టైమ్స్ నౌ, సీఎన్ఎన్ – ఇస్పోస్, ఏబీపీ – సీ ఓటర్, న్యూస్ ఎక్స్ వంటి చానళ్లు 70 నుంచి 77 వరకూ బీజేపీ ఖాతాలో సీట్లు వేశాయి. జన్‌కి బాత్ కొద్దిగా మొహమాటపడి… 57 సీట్లతోనే సరిపెట్టింది. కానీ ఫలితం మాత్రం.. బీజేపీకి 40 సీట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే.. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మొత్తం హర్యానా విషయంలో చిలక జోస్యాలుగానే భావించాల్సి ఉంది.
ఇక మహారాష్ట్ర విషయంలోనూ… ఫలితాన్ని అందరూ.. ఊహించినప్పటికీ.. సీట్ల విషయంలో మాత్రం.. బోల్తా పడ్డారు. బీజేపీ – శివసేన కూటమి స్వీప్ చేస్తుందని…అదీ కూడా… 288 స్థానాలున్న అసెంబ్లీలో 230 సీట్ల వరకూ… బీజేపీ -శివసేన కూటమికి వస్తాయని చెప్పుకొచ్చారు. టైమ్స్ నౌ 230, సీఎన్ఎన్ 243, ఏబీపీ సీ ఓటర్ 204, ఇండియా టుడే 180, జన్ కీ బాత్ 223 సీట్లు బీజేపీ కూటమికి వస్తాయని అంచనా వేశాయి. మొత్తం సర్వేల సగటు తీసుకున్న బీజేపీ కూటమికి 216, కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమికి 59 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఫలితాల్లో బీజేపీ – శివసేన కూటమికి సీట్లు 160దగ్గరే నిలిచిపోయాయి. ఇతరులు పెద్ద ఎత్తున సీట్లు కైవసం చేసుకున్నారు.
ఎన్నికలు అనగానే.. ఇంగ్లిష్, హిందీ టీవీ చానళ్లు..సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తో హడావుడి ప్రారంభిస్తాయి. రాను రాను.. ఇదో పెద్ద వ్యాపారంలా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు కావాల్సినట్లుగా.. సర్వేలు చేసిచ్చే సంస్థలు పెరిగిపోయాయి. టీవీ చానళ్లన్నీ.. ఏదో ఓ రాజకీయ పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉంటూండటంతో.. ఆయా పార్టీలకు మెరుగైన ఫలితాలేస్తున్నారు. జాతీయ మీడియాలో ఎక్కువగా బీజేపీకి మద్దతుగా ఉన్న చానళ్లు కావడంతో… అ ప్రభావం సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌లో కనిపిస్తున్నాయి. నిఖార్సుగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థలు దాదాపుగా కనుమరుగయ్యాయి.