టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని ఊహించలేదు. కొద్దో గొప్పో మెజారిటీతో గట్టెక్కేస్తామనే ధీమాతోనే ఉంటూ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా తెరాస కంటే బాగానే సాగించిందని చెప్పాలి. అయితే, ఓటమిపై అసలైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ కి ఎంతైనా ఉంది. నాయకుల స్థాయిలో ఐక్యత బాగానే ఉంది. వ్యక్తిగతంగా ఎన్ని రకాల విభేదాలున్నా పార్టీకి అవసరం అనుకున్నప్పుడు అందరూ కలిసి పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చారు, అంతవరకూ బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్, ఓటర్ల నాడి, కింది స్థాయి కేడర్ ఆలోచనలో మార్పును అంచనా వేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కొంత స్వయంకృతమైతే.. మరికొంత అధికార పార్టీకి ఉన్న సానుకూలతలను తట్టుకునే శక్తి లేకపోవడం కూడా కారణంగా చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ చేతిలో ఓడిపోయిన తెరాస అభ్యర్థి సైదిరెడ్డికి ఈసారి సానుభూతి కలిసొచ్చింది. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినా ఒరిగేది ఏముండదనీ, తెరాసకు ఓటెయ్యడమే మంచిదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు. ఇప్పటికే వరుసగా రెండుసార్లు… అంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసిన ప్రజల్లో ఈసారి తెరాసకు అవకాశం ఇద్దామనే మార్పు కనిపించింది. ఏడు మండలాల్లో ఓటింగ్ సరళి గమనిస్తే దాదాపు ఇదే తరహా ఫలితం కనిపిస్తుంది.
పోల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే… హుజూర్ నగర్లో చాలామంది సర్పంచులు, ఎంపీటీసీలను తెరాస చేర్చుకుంది. ఈ సర్పంచులు, ఎంపీటీసీలు క్షేత్రస్థాయిలో పార్టీకి బలంగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది! ఎలా అంటే, తమ పంచాయతీ పరిధిలో తెరాసకి ఓట్లు వేయించలేకపోతే… అది పార్టీ అధినాయకత్వానికి స్పష్టంగా తెలిసిపోతుందనీ, ఆ తరువాత అధికార పార్టీ నుంచీ… ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి నుంచి కూడా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందనే పక్కబెదురు వారిలో బాధ్యతను ద్విగుణీకృతం చేసిందని చెప్పొచ్చు.
ఎలాగూ ఉప ఎన్నిక వస్తుందని ముందే తెలుసు కాబట్టి, అధికారంలో ఉన్న పార్టీగా గత కొన్ని నెలలుగా హుజూర్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ పథకాలను పక్కగా అమలు చేస్తూ ప్రజల్ని ఆకట్టుకోవడంలో కూడా తెరాస సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో… ఈ విషయంలో విమర్శించే అవకాశం కాంగ్రెస్ కి దక్కలేదు. ఇక, డబ్బు ప్రభావం… ప్రతీ ఓటరుకీ అధికార పార్టీ నుంచి బాగానే అందింది అనే ప్రచారం స్థానికంగా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ బాగా వెనకబడిందని కూడా క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలకు ముందే… ఆర్థికంగా తన పరిస్థితి ఏమంత బాలేదని ఉత్తమ్ చెప్పిన సంగతి తెలిసిందే కదా! మొత్తానికి, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల నుంచి క్షేత్రస్థాయిలో మేనేజ్మెంట్ సరిగా లేదనేది తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.