జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ఏ పార్టీ విధానంతో కలిసి ముందుకు సాగుతుంది అనే ప్రశ్నలు అసెంబ్లీ ఎన్నికల తరువాతి నుంచీ ఉన్నాయి. అయితే, అన్ని పార్టీలకూ సమానదూరం పాటిస్తూనే జనసేనాని మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీ, వైకాపా, భాజపాలను పార్టీలపరంగా వారి విధానాలపై గట్టిగానే విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో జనసేన భవిష్యత్తులో ఎవ్వరితోనూ పొత్తులు ఉండవా… దానిపైనే స్పష్టత ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షలో ఆయన మాట్లాడుతూ… అధికార పార్టీపై మరోసారి విమర్శలు చేశారు. ఇసుక విధానాన్ని తప్పుబట్టారు. ఇసుక కొరత సృష్టించి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులను నిరుద్యోగుల్ని చేశారనీ, వైకాపా పతనం ఇసుకతోనే ప్రారంభమౌతుందని తీవ్ర విమర్శ చేశారు.
భాజపా, కమ్యూనిష్టులు ఒకరంటే ఒకరికి పడదనీ, అలాంటి పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కలిసి పనిచేశాయన్నారు పవన్ కల్యాణ్. ఐడియాలజీ పరంగా ఏమాత్రం సంబంధం లేని రెండు పార్టీలు ఒక రాష్ట్ర విభజన సమయంలో కలిసినప్పుడు, ప్రజా సమస్యల కోసం మనం ఎవ్వరితోనైనా ఎందుకు ఏకీకృతం కాకూడదని తనకు ఆనాడే అనిపించిందన్నారు. నేను ఏరోజున ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎటువైపు వెళ్లినాగానీ…. దాని వెనక జనసేన ఉనికిని కాపాడుకుంటూ రాష్ట్ర దేశ ప్రయోజనాల్ని రక్షించుకుంటూ చాలా బలమైన ప్రణాళికతోనే మనం పొత్తులు పెట్టుకుంటాం అన్నారు. పార్టీ ఏ నిర్ణయాలు తీసుకున్నా దాని వెనక ఈ స్థాయిలో ఆలోచనలో విధానం ఉంటుందని కార్యకర్తలకు చెప్పారు. అయితే, ఈరోజున ఏ పార్టీకీ భావజాలం లేదన్నారు. నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడమే టీడీపీ భావజాలమనీ, 30 ఏళ్లపాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటమే వైకాపా భావజాలమనీ విమర్శించారు.
పొత్తుల విషయంలో పవన్ ఆలోచనా విధానం ఇలా ఉంది. పొత్తులు ఉండొచ్చు, ఆ దిశగా పార్టీ నిర్ణయం తీసుకోవచ్చు అని చెబుతూనే… ఇప్పుడున్న పార్టీలకు భావజాలం లేదని అంటున్నారు. అంటే… ఇప్పుడు అన్ని పార్టీలనూ పవన్ విమర్శిస్తున్న పరిస్థితి ఉన్నా, అవసరమైతే భవిష్యత్తులో ఈ పార్టీల్లో ఏదో ఒక పార్టీతో కలిసి ముందుకు సాగుతామనే సంకేతాలు కూడా ఇచ్చారు. అప్పుడు విమర్శించారు కదా… ఇప్పుడీ పొత్తులేంటి అనే చర్చ పార్టీ కార్యకర్తల్లో భవిష్యత్తులో రాకూడదనే ఆలోచనతో పొత్తులపై ఇలా పవన్ స్పష్టంగా మాట్లాడారని అనుకోవచ్చు.