మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…. అన్ని మీడియా సంస్థలు.. వివిధ రకాల సర్వే సంస్థలతో కలిసి.. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అన్నీ వాస్తవ విరుద్దమే. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలుస్తుందని… అన్ని సర్వేలు చెప్పాయి. అది నిజమయింది. కానీ సీట్ల దగ్గరే తేడా కొట్టింది. అన్ని సంస్థలు… 288 స్థానాలున్న అసెంబ్లీలో 210కిపైగా బీజేపీకి వస్తాయని ప్రకటించాయి. ఒక్క ఇండియా టుడే – యాక్సిస్ మైఇండియా మాత్రమే… 166 నుంచి 198 వరకూ సీట్లు వేసింది. ఇది కూడా.. ఎక్కువే అయినా… ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్న సర్వే ఇది. బీజేపీ కూటమికి 160 సీట్లు వచ్చాయి. మిగతా పేరు గొప్ప చానళ్లన్నీ… 210కి తగ్గలేదు. దాంతో…. అవన్నీ.. ఊహాగానాలేనని తేలిపోయింది.
ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం హోరాహోరీగా ఉందని.. యాక్సిస్ మైఇండియా సంస్థ ఒక్కటే ఊహించగలిగింది. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో… బీజేపీకి 70 సీట్లు ఖాయమంటూ.. అన్ని చానళ్లు ఎగ్జిట్ పోల్స్ హోరెత్తించాయి. ఫలితాలు ముగిసిన క్షణాల్లోనే ఈ ఫలితాలు ప్రకటించాయి. అయితే.. హర్యానాలో అలాంటి పరిస్థితి లేదని పల్స్ పట్టిన యాక్సిస్ మైఇండియా … హర్యానా ఫలితాలను విశ్లేషించడానికి సమయం తీసుకుంది. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు ఫలితాన్ని ప్రకటించింది. బీజేపీకి 40లోపు.. కాంగ్రెస్కు 40లోపు… వస్తాయని… దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీనే కింగ్ మేకర్ కాబోతోందని అంచనా వేశారు. కచ్చితంగా ఫలితాలు అంతే వచ్చాయి.
ఇప్పుడు మాత్రమే కాదు… ఇండియా టుడే కోసం.. చాలా కాలంగా యాక్సిస్ మైఇండియా సంస్థ సర్వేలు చేస్తోంది. ఎప్పుడూ.. లెక్క తప్పని సర్వేలు చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఎన్డీయేకి 339 నుంచి 365 దాకా సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రాల వారిగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు వస్తాయో కూడా అంచనా వేసింది. ఈ లెక్కపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయితే ఫలితాలు మాత్రం.. సరిపోతాయి. ఒక్క బీజేపీకే 303 సీట్లు వచ్చాయి. ఎన్డీఏకు 350 దాటిపోయాయి. యాక్సిస్ మైఇండియా 2013 నుంచి ఎగ్జిట్ పోల్స్ సర్వే చేస్తోంది. ఇప్పటిదాకా 36 ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. అందులో 34 ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయ్యాయి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఉంటుందని… యాక్సిస్ మై ఇండియా స్పష్టంగా చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ వైసీపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.