గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పలేదు. కానీ టీడీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలలో కాకుండా… బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరతపై ఆందోళనలు నిర్వహిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. కానీ… గన్నవరంలో మాత్రం ఎమ్మెల్యే వంశీ… గుంటూరు, ఒంగోలుల్లో పర్యటిస్తున్న మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి వెంట తిరుగుతున్నారు. ఆయన తో పాటు… బీజేపీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలను.. ఏపీలో సుజనా చౌదరి చేస్తున్నారు. రోజుకో చోట… ఈ యాత్రల్లో పాల్గొంటున్నారు. గురు, శుక్రవారాల్లో సుజనా చౌదరితోనే … వంశీ ఉన్నారు. ఇది టీడీపీ నేతల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వల్లభనేని వంశీ, సుజనా చౌదరికి బంధుత్వం ఉంది. సుజనా చౌదరి బీజేపీలో చేరినప్పుడే… వల్లభనేని వంశీ కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే.. వంశీ ఈ వార్తల్ని ఖండించారు. తర్వాత సైలెంటయిపోయారు. పెద్దగా బయట కనిపించడం లేదు. అయితే… వారం రోజుల కిందట.. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారంటూ.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణమైనా అరెస్ట్ అంటూ.. పోలీసులు మీడియాకు లీక్ ఇచ్చి హడావుడి కూడా చేశారు. దీందో వంశీ ఆ కేసు ఫేక్ దంటూ… కొన్ని ఆధారాలు మీడియా ముందు పెట్టారు. తనను.. వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన నమ్ముతున్నారు. అందుకే.. రక్షణ కోసమైనా ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ మార్పు అంశంపై .. వల్లభనేని వంశీ నోరు విప్పడం లేదు. పార్టీ మారే ఆలోచన లేదని చెబుతున్నారు. అయితే.. ఆయన బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. సుజనా చౌదరితో సన్నిహితంగా మెలుగుతున్నారు. పార్టీ మారితే అనర్హతా వేటు పడుతుందన్న ఉద్దేశంతో… అటు పార్టీ మారకుండా.. ఇటు వైసీపీకి హెచ్చరికలగా.. బీజేపీతో సన్నిహితంగా ఉంటూ… రాజకీయంగా.. రెండు పడవలపై ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం.. టీడీపీ వర్గాల్లో ఉంది. టీడీపీ కూడా ఇప్పుడు.. ఇలా చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు.