ఒక్క కేసుకే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోయారా..? ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే అంతే ఉంది. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ.. ప్రెస్‌మీట్‌లో ఆరోపణలు గుప్పించిన ఒక్క రోజుకే.. ఆయన ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రత్యక్షమయ్యారు. కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి.. జగన్ వద్దకు వెళ్లారు. అరగంటకుపైగా జగన్ తో సమావేశమయ్యారు. తనపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల గురించి వివరించానని ఆయన మీడియా వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఎమ్మెల్యేపై.. పై స్థాయిలో తెలియకుండా అక్రమ కేసులు పెట్టే అవకాశం లేదు. ఆ మాత్రం తెలియకుండా.. వల్లభనేని వంశీ ఇంత కాలం రాజకీయాల్లో ఉండరు.
విషయం తెలిసి కూడా.. ఆయన నేరుగా.. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారంటే.. సరెండర్ అయిపోయినట్లేనని… టీడీపీ వర్గాలు సెటైర్లు ప్రారంభించాయి. వైసీపీ వర్గాలు మాత్రం.. దీన్నో అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి. వల్లభనేని వంశీనే… వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని.. కలసి పని చేసేందుకు సిద్ధమని జగన్ కు చెప్పారన్న ప్రచారం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చంద్రబాబును.. ఈ ఉదయం సుజనాను.. వంశీ కలిశారు. పార్టీ మార్పుపై ఆయన ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ జగన్ ను కలిసి మాత్రం.. తాను కేసుల విషయంలో ఎంత భయపడుతున్నారో బయట పెట్టుకున్నారని అంటున్నారు.
వల్లభనేని వంశీకి దూకుడైన నేతగా పేరుంది. ఒకప్పుడు ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉండేవారు. దాంతో.. ఆ కుటుంబానికీ సన్నిహితులే. ఆ బ్యాక్ గ్రౌండ్ చూసి.. ఆయన కేసులకు భయపడే రకం కాదని అందరూ అనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క కేసుకే భయపడిపోయారన్న సెటైర్లు రెండు పార్టీల్లోనూ వినిపిస్తున్నాయి.