ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం టెండర్లు వేసిన ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ లిమిటెడ్ చదరపు అడుగుకి రూ.4,000 ధరను చెల్లించాలని సి.ఆర్.డి.ఏ.ని కోరినట్లు తెలుస్తోంది. కానీ సి.ఆర్.డి.ఏ. అధికారులు చదరపు అడుగుకి రూ.3,000 మాత్రమే చెల్లించేందుకు నిర్ణయించుకోవడంతో ఆ రెండు సంస్థలు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. కేవలం ఆరు నెలలలో ఆరు భవనాలను పూర్తిగా నిర్మించి ఇవ్వాలంటే, రేయింబవళ్ళు పనిచేయవలసి ఉంటుందని, రాత్రి పూట నిర్మాణ కార్యక్రమాలు కొనసాగిస్తే అందుకు అదనంగా మరో 30 శాతం ఖర్చు అవుతుందని కనుక తాము కోరిన ధర చెల్లిస్తేనే ఈ పని చేపట్టగలమని తేల్చిచెప్పినట్లు సమాచారం. కానీ సి.ఆర్.డి.ఏ. అధికారులు అందుకు అంగీకరించలేదు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. మరిన్ని సంస్థలు ఈ పని చేసేందుకు ముందుకు వచ్చేందుకు వీలుగా ఈసారి కొన్ని షరతులు సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయం నిర్మాణం ఆరు నెలలో పూర్తి చేయాలి లేకుంటే నిర్మాణ వ్యయంలో 10 శాతం జరిమానా విధింపు అనే రెండు షరతులు కారణంగానే నిర్మాణ సంస్థలు అన్నీ వెనకడుగు వేస్తున్నాయి. ఒకవేళ సి.ఆర్.డి.ఏ.ఆ రెండు షరతులు సడలించి, చదరపు అడుగుకి ధర మరి కొంత పెంచే మాటయితే టెండర్లు వేసిన ఆ రెండు సంస్థలే నిర్మాణం చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని సమాచారం.
తాత్కాలిక సచివాలయానికి ఈనెల 12వ తేదీన శంఖుస్థాపన చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నాక, ఆరు నెలలోనే నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్న సి.ఆర్.డి.ఏ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్ల పిలవాలనే ఆలోచన చేయడం చిత్రంగానే ఉంది. దాని వలన పనులు మరొక మూడు నాలుగు వారాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కదా?