వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధానిపై చేసిన ఆరోపణల్లో.. ఒక్కొక్కదానిపై.. క్లారిటీ ఇస్తూ పోతోంది. ఇంత వరకూ రాజధానిలో లక్షల కోట్ల స్కాములు జరిగాయని.. ఆరోపిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు… తాము అలా చెప్పలేదని కవర్ చేసుకుంటోంది. సాక్షాత్తూ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ… ఇదే మాట చెప్పారు. రాజధాని నిర్మాణాల్లో రూ. 30వేల కోట్ల అవినీతి జరిగిందని తాము ఎప్పుడూ చెప్పలేదని మీడియా ముందు.. తేల్చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో… అమరావతిలో రూ. 9వేల కోట్లకు పనులు పిలిచారని.. రూ. 5,400 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మరి వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎందుకు చేశారంటే… మాత్రం.. బొత్స తనదైన మార్క్ వివరణ ఇచ్చారు. అంత మొత్తం అవినీతికి తలుపులు తెరిచారని చెప్పాం కానీ.. అవినీతి చేశారని చెప్పలేదంటున్నారు.
ఏపీలో సర్కార్ ఏర్పడినప్పటి నుండి.. రాజధానిపై మంత్రులు చేసిన ఆరోపణలకు లెక్కలేదు. లక్షల కోట్లలోనే ఆ ఆరోపణలు ఉండేవి. అవినీతిని వెలికి తీస్తామని.. ఆ తర్వాత రాజధాని నిర్మాణం గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. ఐదు నెలలు దాటినా.. అవినీతిని వెలికి తీయలేకపోయారు కానీ… ఇప్పుడు.. అవినీతి జరిగిందని చెప్పలేదని… నిర్మోహమాటంగా చెబుతున్నారు. అలాంటప్పుడు… పనులు ఎందుకు నిలిపివేశారన్న ప్రశ్న వస్తుంది. అందుకే.. అవినీతికి తలుపులు తెరిచారని.. తాము మూసేస్తామన్నట్లుగా… బొత్స కవర్ చేస్తున్నారు.
రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. టీడీపీ నేతలు వందలు, వేల ఎకరాలు కొనుగోలు చేశారని.. ఆరోపిస్తూ.. వైసీపీ ప్రభుత్వం కమిటీలు కూడా నియమించింది. ఆ కమిటీలు.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో… డాక్యుమెంట్లన్నీ వడపోసి… అమ్మకాలు జరిపిన రైతుల ఇళ్లకూ.. వెళ్లి… వాళ్ల దగ్గర ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుని.. చేయాల్సినంత రచ్చ చేశారు. కానీ ఇంత వరకూ.. ఒక్కటంటే.. ఒక్క ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారమూ బయట పెట్టలేపోయారు. ఇప్పటికి ఐదు నెలలయింది. ఇప్పుడు మాత్రం.. అలాంటివేమీ లేవన్నట్లుగా ప్రభుత్వమే.. ఏదో రూపంలో.. ప్రకటించాల్సి వస్తోంది.