భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ను గెలిపించిన హుజూర్ నగర్ ప్రజలను.. తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లుల్లో ముంచెత్తారు. రోడ్ల దగ్గర్నుంచి కోర్టు వరకూ.. అన్ని వరాలను ప్రకటించేశారు. తెలంగాణ బంగారు మయం అవక ముందే… బంగారు హుజూర్ నగర్ సాక్షాత్కరించతడం ఖాయమని కేసీఆర్ హామీలతో తేలిపోతోంది. హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీకి .. సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ. 20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో మండల కేంద్రానికి రూ. 30 లక్షలు, హుజూర్‌నగర్‌లో రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు , నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
హుజూర్‌నగర్‌లో కల్వర్టులు నిర్మిస్తామని ..గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్‌కు తీసుకొస్తామన్నారు. అవసరమైన లిఫ్ట్‌లు, కాలువలు నిర్మిస్తాంమని హామీ ఇచ్చారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి రెసిడెన్షియల్ స్కూల్ , నియోజకవర్గంలో బంజారాభవన్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో ..పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సభలోనే హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ, కోర్టును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్లు లేనందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామన్నారు.
కేసీఆర్ హామీలు అమలయితే.. హుజూర్ నగర్ దశ తిరిగిపోయినట్లే అవుతుంది. రోడ్డు మార్గం ద్వారా … కేసీఆర్ హుజూర్ నగర్ వచ్చారు. వర్షం పడటంతో… ఓ దశలో సభ జరుగుతుదో లేదో అనుకున్నారు. కానీ తర్వాత వర్షం ఆగడంతో.. సభ సజావుగా సాగింది. మొదట సూర్యాపేట చేరుకుని అక్కడ హుజూర్ నగర్ లో పార్టీ కోసం పని చేసిన వారితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత హుజూర్ నగర్ వచ్చారు.