ఆదేశించిన గంటల్లోనే జీవోలు విడుదల కావాలంటూ… ముఖ్యమంత్రి బిజినెస్ రూల్స్ మార్చిన ప్రభావం… వెంటనే కనిపిస్తోంది. సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు జీవోలు.. నిన్న వెంట.. వెంటనే విడుదలయ్యాయి. ముందుగా ఆరోగ్యశ్రీ సేవలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు వర్తిస్తూ.. జీవో జారీ చేశారు. ఆ మూడు నగరాల్లో పదిహేడు ఆస్పత్రులను ఏపీ సర్కార్ గుర్తించింది. ఆ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా చర్యలను తీసుకోవాలని జీవో ద్వారా ఆదేశించారు. మొత్తం 716 చికిత్సలకు ఏపీ ప్రజలు పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకోవచ్చు. ఇక మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో భాగంగా పెన్షన్ రూపంలో సాయం అందించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
మేజర్ తలసేమియా, సికిల్ సెల్, సివియర్ హిమోఫీలియాతో బాధపడుతున్నవారికి నెలకు రూ. 10 వేల సాయం, గ్రేడ్ ఫోర్ బోదకాలు, పక్షవాతం, తీవ్రమయిన కండరాల వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ. 5 వేలు సాయం మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. అయితే.. ఈ పథకం ఇప్పుడే కాదు.. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి ఇప్పుడే జీవో జారీ చేశారు. ఇక … ఎప్పట్నుంచో చెబుతున్న… పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంపు, ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వారికి వేతనాలు పెంపుపై కూడా.. ఇప్పుడు జీవో జారీ చేశారు. అయితే.. పెంచిన వేతనాలు జనవరి 1 నుంచి అమలు చేస్తారు.
ఐదు నెలల కాలంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి చాలా హామీలిచ్చారు. చాలా వరకు హామీలుగానే ఉండిపోయాయి. వీటిపై అధికారులు దృష్టి పెట్టడం లేదని మండిపడుతూ.. బిజెనెస్ రూల్స్ మార్చేశారు. అయితే.. ప్రతీ హామీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. నిధుల కటకటతో.. అధికారులు.. క్లియరెన్స్ ఇవ్వడానికి జంకుతున్నారు. ఇవ్వకపోతే.. సస్పెండ్ అని ఆదేశాలివ్వడంతో… ఇక నిధుల లభ్యత గురించి పట్టించుకోకుండా… ఆర్థిక శాఖ అధికారులు..ముఖ్యమంత్రి ఇచ్చిన అన్ని హామీలపై వెంటనే ఆదేశాలు జారీ చేయడం … ప్రారంభమయింది.