హుజూర్ నగర్ ఉపఎన్నిక వైసీపీకి టానిక్‌గా మారింది. రాజకీయ వ్యూహాలకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఉపఎన్నికల్లో అధికార పార్టీలకు తిరుగులేని విజయాలు వస్తాయని.. మరో సారి నిరూపితం కావడంతో… తెలుగుదేశం పార్టీని కోలుకోనివ్వకుండా దెబ్బకొట్టాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల ఉపఎన్నికల్లో తమకు ఎదురైన ఓటమి రుచిని ఐదేళ్ల పాటు… టీడీపీకి రుచి చూపించాలని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో.. తొలి ఉపఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఇప్పటికే రాజీనామాకు సంసిద్ధత వ్యక్తం చేయగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా.. ఈ విషయంలో రెడీగా ఉన్నారని చెబుతున్నారు. త్వరలో వీరు ముగ్గురు టీడీపీకి రాజీనామా చేస్తారని.. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు.
ముగ్గురితో ముందు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి.. తటస్థ సభ్యులుగా కొనసాగించే రాజకీయ మార్గాన్ని అనుసరించాలని వైసీపీ భావిస్తోంది. అధికారంలో ఉండటం, ఆర్థిక, అంగబలాలు పుష్కలంగా ఉండటం, ఇదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు నైతికంగా దెబ్బతిని ఉండటంతో.. గెలుపు సులువేనని నమ్ముతున్నారు. వల్లభనేని వంశీతోపాటు రాయలసీమకు సమీపంలో ఉన్న ఓ జిల్లా ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రలోని మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేవారి జాబితాలో ఉన్నారంటున్నారు. ఉపఎన్నికల్లో విజయాలు చాలా సులువేనని స్పష్టం అవడంతో.. మరింత దూకుడుగా వెళ్లాలని… జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు.. కొత్తగా కేసులు పెట్టి.. మరో విధంగా ఒత్తిడి చేసి పార్టీలో చేర్చుకుని.. ఉపఎన్నికలు తీసుకొస్తే.. ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం. తెలంగాణ పరిస్థితులు.. ఏపీ పరిస్థితులు వేరన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. కావాలని తెచ్చి పెట్టుకున్న ఎన్నికలతో ఎదురుదెబ్బ తగిలితే… ఇమేజ్ మసకబారుతుందని.. వైసీపీలోని ఓ వర్గం ఆందోళన చెందుతోంది. ఈ రాజకీయాలను మూడేళ్లపాటు పక్కన పెట్టి.. పాలనపై దృష్టి పెడితే బాగుంటుందన్న సలహాలిస్తున్నారు. కానీ ఆ సలహాలను పట్టించుకునేవారే లేరు..!