వైసీపీ నాయకత్వంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. తనకు .. టీడీపీ నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని… కానీ వైసీపీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని అయంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా.. ఆన్ లైన్ ఇసుక మాఫియా తయారయిందని.. దానిపై పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి బ్లాక్ మార్కెట్లో మాత్రమే దొరుకుతున్న ఇసుక దందాలో వైసీపీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో… ఇసుక మాఫియా అంతు చూస్తానంటూ.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుకొస్తున్నారు. ఆన్లైన్లో రెండు నిమిషాలకే నో స్టాక్ బోర్డు వస్తోందని… నెల్లూరులోని ఓ రీచ్ నుంచి ఎమ్మెల్యేల పేరుతో ఇసుక తరలిస్తున్నారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకూ ఇసుక దొరికేలా అధికారులు చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తానని ప్రకటించారు.
కోటంరెడ్డి చెప్పిన పొట్టిపాళెం ఇసుక రీచ్ .. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుల కనుసన్నల్లో ఉంటుంది. కొద్ది రోజుల క్రితం.. ఎంపీడీవోపై దాడి చేసిన ఘటనలో.. ఆయనపైనే కోటంరెడ్డి ఆరోపణలు చేశారు. అప్పట్లో… వైసీపీ పెద్దలు రెండు వర్గాలనూ… అమరావతి పిలిపించి సెటిల్ చేశారు. నెలలో ఇరవై ఐదు రోజుల పాటు.. నియోజకవర్గానికి దూరంగా ఉండాలని.. కోటంరెడ్డి..జగన్ ఆదేశించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే్.. ఆ తర్వాత కోటంరెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.
ఇసుక విషయంలో తీవ్రమైన రచ్చ జరుగుతున్న సమయంలో… ఎమ్మెల్యే మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇసుక విషయంలో ఇప్పుడు.. ఎలాంటి ప్రకటనలు చేసినా…అది అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే… ప్రభుత్వంలో ఉన్న ఎవరూ నోరు మెదపడంలేదు. అడపాదడపా గనుల మంత్రి మాత్రమే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కోటంరెడ్డి వ్యవహారశైలి.. వైసీపీ వర్గాల్లోనే కలకలం రేపుతోంది. ఆయన తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారన్న అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చారు.