రాజకీయాల నుంచి తాను రిటైర్ అయ్యాననీ, ఇకపై ఎలాంటి నామినేటెడ్ పదవుల్లాంటివి వచ్చినా తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏపీ రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం మరీ అంత ఘోరమైన పరాభవం అని తాను భావించడం లేదన్నారు. దాదాపు 40 శాతం ఓట్లొచ్చాయనీ, 2004లో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చిందనీ, 2014 వచ్చే సరికి మళ్లీ పుంజుకున్నారన్నారు. చాలాకాలం నుంచి పార్టీ ఉందనీ, క్షేత్రస్థాయిలో బలమైన వర్కర్లున్నారు అన్నారు.
తన ఉద్దేశంలో వైయస్సార్ సీపీకి ఇంకా పార్టీ లేదన్నారు ఉండవల్లి! జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇమేజీ మాత్రమే ఉన్నాయనీ, పార్టీ నిర్మాణం లేదనీ, ఆ అభిమానంతో ఓట్లు వేసేవాళ్లు మాత్రమే ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పార్టీ నిర్మాణం బలంగా ఉండేవారికి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుందనీ, ఆ రకంగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు పుంజుకునే అవకాశం ఉందనే అనుమానం తనకు ఉందన్నారు ఉండవల్లి. చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి వెళ్లడం అంత మంచిది కాదన్నారు. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు కారణం ఆయన సన్నిహితులే అవమానించారు అనేదే కారణమై ఉండొచ్చనీ, అయితే ఇవాళ్ల టీడీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే… ఆయనపై అధికార పార్టీ కేసుల వేధింపులు అనేది బలంగా ఉందన్నారు. తమని వెంటాడుతున్నారు అంటూ చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు బాగా ప్రచారం చేస్తున్నారనీ, సామాన్యులు దాన్ని నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. అయితే, ఇలాంటి ప్రచారం వల్ల చంద్రబాబు నాయుడుకి ఎంత మేలు జరుగుతుందో తెలీదుగానీ, జగన్ కి ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిది కాదనీ, కింది స్థాయి అధికారులు చెయ్యాల్సిన పని అనీ, కానీ జగన్ మీటింగ్ పెట్టిమరీ ప్రకటించడం సరికాదన్నారు.
ప్రస్తుతం టీడీపీ నుంచి కొంతమంది ప్రముఖ నేతలు వలస వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదు, లేదా ఇబ్బందులు తప్పవు అనే ఒక అభిప్రాయాన్ని కలిగించే విధంగానే వాతావరణం ఉంది! ఈ నేపథ్యంలో పార్టీపరంగా సొంత నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం టీడీపీ నుంచి జరగాలి. ప్రయత్నం అంటే కేవలం బుజ్జగింపులు మాత్రమే కాదు… త్వరలో రాబోయే ఏదో ఒక ఎన్నికల్లో అధికార పార్టీపై పైచేయి సాధించాలి. ఇలాంటి సందర్భంలో ఉండవల్లి లాంటివారి ఈ తరహా విశ్లేషణలు టీడీపీకి కొంత ఊరట కలిగించేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.