ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వైకాపా అధికారంలోకి రాగానే పాత విధానం రద్దు చేశారు. కొత్తది తెస్తామంటూ నాలుగైదు నెలలపాటు కాలక్షేపం చేయడంతో ఇసుకకి తీవ్రమైన కొరత ఏర్పడింది. కొత్త విధానం వచ్చి నెలలు గడుస్తున్నా ఇసుక లబ్ధి సరిపోవడం లేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రులను అడ్డుకుని ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకపోతోంది. ఇదే అంశమై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా స్పందించారు. ఆంధ్రాలో పరిపాలించడానికి వైకాపా పనికిరాదనీ, రంగులేసుకుని ఆర్భాటాలకు మాత్రమే పనికొస్తుందని విమర్శించారు. 151 సీట్లిచ్చి ప్రజలు గెలిపిస్తే, వారికి రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కొరత సృష్టించారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టగొడుతున్నారన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కన్నా ఒక ట్వీట్ లో విమర్శించారు.
ఇసుక కొరత ఆంధ్రాలో చాలా తీవ్రమైన సమస్యే. ప్రతిపక్ష పార్టీలేవీ దీన్ని పూర్తిగా ఓన్ చేసుకుని, కార్మికుల తరఫున బలంగా పోరాటం చేసే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు భాజపా అధ్యక్షుడు కన్నా స్పందన కూడా ఏదో తూతూ మంత్రంగానే అన్నట్టుగా ఉంది. ఈ విషయంలో ఒక్క జనసేన పార్టీయే కొంత నయం అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇసుక సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. జిల్లాలవారీగా నిర్వహిస్తున్న పార్టీ సమీక్షల్లో ఇదే అంశంపై ప్రధానంగా మాట్లాడుతూ… జగన్ సర్కారు పతనం ఇసుకతోనే మొదలైందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై ఇదే ప్రధాన పోరాటాంశంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ అంశాన్ని తూతూ మంత్రంగానే తీసుకుందని చెప్పొచ్చు. ఇసుక విధానంపై చంద్రబాబు కొన్ని విమర్శలకు మాత్రమే పరిమితమౌతున్నారు. భవన నిర్మాణ కార్మికుల తరఫున నిరసన కార్యక్రమాల్లాంటివి పెద్ద ఎత్తున చేపట్టే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడా పార్టీలో నాయకుల వలసల చర్చకే సమయం సరిపోవడం లేని పరిస్థితి!
భవన నిర్మాణ కార్మికుల తరఫున ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపై వచ్చే అవకాశం అస్సలు కనిపించడం లేదు. భాజపా, జనసేన, టీడీపీ… ఈ పార్టీల నాయకులు ఇసుక సమస్యపై మాట్లాడతారు. కానీ, కలిసి పోరాటం చేసేందుకు ఉన్న అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోరు! రాజకీయంగా చూసుకున్నా ఈ అంశంపై పోరాటం చేసిన పార్టీకి మైలేజ్ బాగానే వస్తుంది. సొంతంగా ఎదగాలని చూస్తున్న భాజపా ఇదో అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ చేసే తొలి బలమైన పోరాటంగా దీన్ని వాడుకోవచ్చు. ఒక్కసీటూ లేకుండా, ఉన్న నాయకులు కూడా బయటకి వెళ్లిపోతున్న జనసేనకు కూడా ఇదో ఊరటనిచ్చే అంశం అవుతుంది. అయినాసరే, సొంతంగా ఏ పార్టీ కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమౌతున్న దాఖలాలు లేవు.