వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ.. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయాన్ని… చంద్రబాబు డీల్ చేస్తున్న వైనం రాజకీయవర్గాలకు సైతం విస్మయానికి గురి చేస్తోంది. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలో.. అన్ని రకాల ప్రోత్సాహం పొంది.. ఒక్క సారి అధికారం కోల్పోగానే.. వేధింపులంటూ.. వెళ్లి.. అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న వైనం.. కళ్ల ముందు కనిపిస్తున్నా… ఆయన చెప్పిన కుంటి సాకుల్ని తీరుస్తామంటూ.. చంద్రబాబు… వాట్సాప్ లేఖల్లో బుజ్జగించే ప్రయత్నం చేయడం.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వంశీతో మాట్లాడాలంటూ.. పార్టీ నేతల్ని పురమాయించడం… కొంత మంది సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తికి కారణం అవుతుంది. వంశీ వాట్సాప్ ద్వారా టీడీపీకి రాజీనామా లేఖ పంపితే.. చంద్రబాబు కూడా.. రిప్లయ్ ఇచ్చారు. ఇలా రెండు సార్లు జరిగింది. చంద్రబాబు అంతగా తగ్గాల్సిన అవసరం లేదనేది చాలా మంది మాట.
నిజానికి వల్లభనేని వంశీ.. తెలుగుదేశం పార్టీని వీడాలనుకుంటున్నది… ఆ పార్టీలో ఆదరణ కరువై కాదు. అధికార పార్టీ అనే మోజుతో.. వైసీపీ ఆకర్షణకు లోనై ఆయన పార్టీ మారుతున్నారు. పరిటాల రవి అనుచరుడిగా ఉన్న ఆయన కేసులు.. వేదింపులకు భయపడే రకమని.. ఎవరూ అనుకోరు. ఈ విషయం టీడీపీ నేతలందరికీ తెలుసు. 2012లో ఓ సందర్భంలో జగన్ ఎదురుపడినప్పుడే.. అత్యంత ఆత్మీయుడు ఎదురైనట్లుగా.. కావలించుకున్న ఆయన తీరు అప్పుడే వివాదాస్పదమయింది. నిజానికి పరిటాల రవి హత్య విషయంలో.. జగన్ పైనే.. ఆయన అనుచరులంతా.. ముక్తకంఠంతో ఆరోపణలు చేస్తూంటారు. అలాంటిది వంశీ మాత్రం భిన్నమైన వైఖరి అవలభించారు.
ఏ విధంగా చూసినా.. వల్లభనేని వంశీ… రాజీనామాకు టీడీపీ కానీ.. టీడీపీ నేతలు కానీ.. టీడీపీ అధినాయకత్వం కాని కారణం కాదు. ఈ విషయాన్ని వంశీ కూడా చెబుతున్నారు. తాను భయపడే రాజకీయాలకు దూరం అవ్వాలనుకుంటున్నానని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు.. ఆయనకు ఓ మాటతో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తే సరిపోయేది. కానీ ఆయన లేఖలు రాయడం.. చంద్రబాబు రిప్లయ్ ఇవ్వడంతో… వంశీకి అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం బలపడిపోతోంది. తెలుగుదేశం పార్టీ అంటే.. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదని.. అందరూ కలిస్తేనే టీడీపీ అని క్యాడర్ గుర్తు చేస్తున్నారు. అన్నీ అనుభవించి.. పోయేవారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు. అందుకే చంద్రబాబు.. బుజ్జగింపుల ప్లాన్‌పై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.