పవన్ కల్యాణ్ సినిమాల కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నా – తన అడుగు ఎలా ఉండబోతోందన్న విషయం అయోమయానికి గురి చేస్తోంది. పవన్ `ఓకే` అంటే వారం రోజుల్లో సినిమా మొదలయిపోతుంది. కానీ… ఆ `ఓకే`నే ఆయన నోటి నుంచి రావడం లేదు. పవన్ కోసం ఎదురుచూపులు చూసేవాళ్లలో క్రిష్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈలోగానే క్రిష్ సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ మెల్లమెల్లగా బయటకు పొక్కేస్తున్నాయి. లీకేజీలు ఎక్కువైన కొద్దీ… తన చేతుల్లోంచి ప్రాజెక్టు జారిపోతుందేమో అని క్రిష్ భయపడుతున్నాడు. పవన్ కూడా… `సినిమాకి సంబంధించి ఎలాంటి లీకేజీలూ ఇవ్వకండి. నేను చెప్పినంత వరకూ ఏ ప్రాజెక్టూ మొదలైనట్టు కాదు` అని కరాఖండీగా చెప్పేశాడట. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దాంతో క్రిష్ కాస్త ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్లాప్ అవ్వడంతో క్రిష్ బాగా డీలా పడ్డాడు. ఇలాంటి తరుణంలో పవన్ సినిమా పట్టాలెక్కితే వచ్చే మైలేజీ, ఉత్సాహం వేరు. అందుకే ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ తన చేతుల్లోంచి జారిపోకూడదని భావిస్తున్నాడు క్రిష్. కానీ అదంతా పవన్ చేతుల్లో ఉంది. పవన్ ఎప్పుడంటే.. అప్పుడు ఈ సినిమా మొదలవుతుంది. కానీ.. పవన్ నుంచి గ్రీన్ సిగ్నలే ఇంత వరకూ అందలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.