దుగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేసినట్లుగా జరుగుతున్న ప్రచారంపై… ఆయన సతీమణి, బీజేపీ నేత పురంధేశ్వరి తేలిగ్గా తీసుకున్నారు. ఆ విషయాన్ని ఆయననే అడగాలని… పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో మీడియాలో వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు తనను వైసీపీలో చేరాలని ఆహ్వానించిన మాట నిజమేనన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం.. ఎవరూ… ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు కుమారుడు హితేష్… వైసీపీలో చేరే సమయంలో… పురందేశ్వరి కచ్చితంగా బీజేపీలోనే ఉంటారని తేల్చి చెప్పారన్నారు. అప్పుడు.. వైసీపీ తరపున ఎవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. అలా అంగీకరించిన తర్వాతే తన భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరారన్నారు.
దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీలోకి తీసుకు రావాలని లేకపోతే.. మీరు పార్టీకి అవసరం లేదని.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు.. వైసీపీ హైకమాండ్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే… పర్చూరు నియోజకవర్గం నుంచి టీడీపీ నేత రావి రామనాథం బాబును.. వైసీపీలో చేర్చుకున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనకే ఇన్చార్జ్ హోదా ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని దగ్గుబాటి వరకూ రానీయడం లేదు. చివరికి విజయసాయిరెడ్డి కూడా దగ్గుబాటికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పురందేశ్వరి బీజేపీలో.. మీరు మా పార్టీలో ఉండటం బాగోదని.. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలన్న సందేశం పంపారు. దీనిపై దగ్గుబాటి కుటుంబం తర్జనభర్జన పడి.. వైసీపీకే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఆయన విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నారు. త్వరలో ఆయన ఓ బహిరంగ లేఖ.. అభిమానులకు రాసే అవకాశం ఉందంటున్నారు. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా.. వైసీపీలో చేరాలనుకోలేదు. ఆయన కుమారుడ్ని చేర్పించి.. పోటీ చేయించాలనుకున్నారు. కుమారుడికి పోటీకి అర్హత రాకపోవడంతో… తానే పోటీ చేయాల్సి వచ్చింది. చివరికి… ఆయనను కూడా వైసీపీ వద్దనుకుంది.