భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కల్యాణ్ భారీ ఉద్యమం నిర్మించేముందు… మరో మైలురాయి లాంటి కార్యక్రమాన్ని భుజాలకెత్తుకున్నారు. వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకాఱం చుట్టారు. జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి ‘వనరక్షణ’ పేరు ఖరారు చేశారు. హైదరాబాద్ శివారులోని తన వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు పవన్ కల్యాణ్. కార్తీక మాస దీక్షను చేపట్టారు. కార్తీక మాసం మొత్తం పవన్ కల్యాణ్ ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కార్యకర్తలతో దగ్గరుండి మొక్కలు నాటించారు.
పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతాలలో ఒకటి. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కార్యక్రమమే వనరక్షణ అని జనసేనాని చెబుతున్నారు. పవిత్ర మాసంలో అందరినీ కలుపుకొని… పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలని జనసైనికులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని పెంచి సంరక్షించడం కూడా అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
పర్యావరణంపై పవన్ కల్యాణ్ అమితమైన ఆసక్తి చూపిస్తారు. నల్లమలలో యూరేనియం తవ్వకాల విషయంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి ప్రణాలికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఆళ్లగడ్డలో యూరేనియం తవ్వకాలను ఖండించారు. త్వరలో ఆయన కడప జిల్లా పులివెందులలో ఉన్న యూరేనియం కర్మాగారం వల్ల… ఏర్పడుతున్న కాలుష్య పరిస్థితులు, బాధితుల్ని… పరామర్శించే అవకాశం ఉంది. జనసేన పార్టీ వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్… తన సైనికులతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందరితో మొక్కల నాటడమే కాదు.. వాటిని సంరక్షించేలా… దిశానిర్దేశం చేస్తున్నారు.