ఐదుగురు రోజు కూలీల ఆత్మహత్య తర్వాత ఇసుక సమస్యపై మొదటి సారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. ఇసుక వారోత్సవం నిర్వహించి సరఫరాలో లోటు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక లేని కారణంగా ఒక్క వ్యక్తికి కూడా.. ఉపాధి లేకుండా పోవడం అనేది జరగకూడదని అధికారులను ఆదేశించారు. ఇసుక వారోత్సవం పెడతాం, వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని… ఇసుక లేక కూలీలకు పనులు దొరకలేదన్న సమస్య తలెత్తదని ముఖ్యమంత్రి తేల్చేశారు. మన రాష్ట్రం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని .. డీజీపీ దగ్గరుండి పర్యవేక్షించాలని కోరుతున్నానని సమీక్షలో జగన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికి కృత్రిమ కొరత సృష్టించి వైసీపీ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని… భారీ మొత్తానికి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇసుక కొరత కారణంగా… కూలీలకు పనులు దొరకడం కష్టమైపోయింది. పలు చోట్ల మంత్రుల్ని కూడా.. కూలీలు అడ్డుకునే పరిస్థితి వచ్చింది. దీంతో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఇసుక కొరతపై సమీక్ష నిర్వహించి.. వారం రోజుల్లో… పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇసుక విషయంలో… రాబందుల్లా రాళ్లు వేస్తున్నారని జగన్ టీడీపీపై మండిపడ్డారు. గతంలో ఇసుకను దోచేశారని.. ఇప్పుడు వ్యవస్థను రిపేర్ చేస్తున్నామని అందుకే కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు.
అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం మంచిదేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ ఇసుక సమస్య ఉన్నట్లుగా గుర్తించడం భవన నిర్మాణ రంగానికి కాస్త రిలీఫ్ ఇచ్చేదే. వారం రోజుల వారోత్సవాల్లో.. ఇసుక సమస్యను .. జగన్ పరిష్కరిస్తే.. ఇప్పటి వరకూ వచ్చిన వ్యతిరేకత అంతా.. మాయమయ్యే అవకాశం ఉంది. పరిష్కరించలేకపోతే… జగన్ సామర్థ్యంపైనే ప్రజల్లో అనుమానాలొస్తాయి.