ఏపీ ముఖ్యమంత్రి చేతకాని తనాన్ని… పాలనా వైఫల్యాల్ని చూసి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎగతాళి చేస్తున్నారా..?. కొద్ది రోజులుగా.. ఏపీ గురించి.. కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే.. అదే నిజమనింపించకమానదు. ఇప్పుడీ విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా.. చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు చూసి.. కేసీఆర్ ఎగతాళి చేస్తున్నారని చెబుతున్నారు. ఆర్టీసీ విలీనం విషయంలో.. కేసీఆర్ మొదటగా.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించారు. ఏపీలో… కార్మికుల్ని మోసం చేస్తున్నారని.. కమిటీలు వేసి కాలయాపన చేసి.. చివరకు ఏమీ చేయరని.. తేల్చేశారు. అంతకు ముందు పోలవరం ఎత్తు తగ్గిస్తామని.. దానికి జగన్ అంగీకరించారని..నేరుగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇక విభజన సమస్యల విషయంలో.. ఏపీ వాదనలను.. అసలు పరిగణనలోకి తీసుకోవద్దని… ఆయా కమిటీలకు కూడా చెబుతున్నారు.
ఇన్ని చేస్తున్నా.. జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేకపోతున్నారు. చివరికి.. ఆర్టీసీకి తెలంగాణ సర్కార్ ఇవ్వాల్సిన బకాయిల విషయంలోనూ..ఏపీ సర్కార్ ప్రస్తావన తీసుకు వచ్చారు. అదే సమయంలో… కొద్ది రోజుల కిందట… కేసీఆర్ తో.. ఏకాంతంగా.. జగన్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చర్చించారంటూ… కొన్ని అంశాలు.. మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడటంపై చర్చించారని మీడియాకు సమాచారం అందింది. దీనిపై.. వైసీపీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కానీ కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. దాంతో ఆ ప్రకటనకు అర్థాంగీకరం లభించినట్లయింది. మరో వైపు ఆ సమావేశంలో… జగన్ .. తన బెయిల్ రద్దు వ్యవహారంపై కూడా చర్చించారని… .. జగన్ సినిమా ఆరు నెలల కంటే ఎక్కువ సాగదని..కేసీఆర్ వ్యాఖ్యానించారంటూ.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన పత్రికలోనే నేరుగా రాశారు.
దీనిపై.. ఎవరూ ఖండన ప్రకటన చేయలేని పరిస్థితి. ఇవన్నీ నిజాలేనని… అంగీకరించక తప్పని పరిస్థితి. అందుకే… జగన్ విషయంలో కేసీఆర్ ఎగతాళి చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం… సాధారణ ప్రజల్లో బలపడుతోంది. దీన్నే చంద్రబాబు బహిరంగంగా చెప్పారు. నిన్నామొన్నటిదాకా ఉమ్మడి ప్రాజెక్టు గురించి మాట్లాడిన జగన్.. ఇప్పుడు… వేరే ప్రణాళికాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో..కేసీఆర్ – జగన్ మధ్య తేడా జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.