హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి. సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డ వెంటనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏదో ఒక కీలక ప్రకటన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తారని అనుకున్నారు. ఆ దిశగానే ఉత్తమ్ ఇప్పుడు స్పందించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ వైఫల్యంపై ఆయన మాట్లాడుతూ… ఓటమికి తనదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ ఉప ఎన్నికలో ఓడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొందన్నారు.
హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తనకి ఉన్న ఓటు బ్యాంకును నిలబెట్టుకుందని ఉత్తమ్ చెప్పారు. అధికార పార్టీ భారీగా ఖర్చు పెట్టిందనీ, దాన్ని తట్టుకోలేకపోయామన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే పార్టీకి పెద్దగా నష్టమంటూ ఏమీ జరగలేదన్నారు! త్వరలోనే మున్సిపల్ ఎన్నికలున్నాయనీ, పార్టీని మరోసారి సమాయత్తం చేసి సత్తా చాటుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగింది.
ఓటమికి నైతిక బాధ్యత వహిస్తానని ఉత్తమ్ చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, ఈ ఓటమి వల్ల పార్టీకి నష్టం జరగలేదని ఆయన చెప్పడం విడ్డూరం! పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజక వర్గం అది. ఓడింది బొటాబొటీ ఓట్లతోనా… వేల సంఖ్యలో తేడా! అలాంటి ఓటమి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ మీద కచ్చితంగా ఉంటుంది. అధికార పార్టీ పెద్ద ఎత్తున సొమ్ము ఖర్చుపెట్టిందీ, ఇంకో రకంగా ప్రలోభపెట్టిందీ అనేది కూడా సరైన విశ్లేషణ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి బలమైన నాయకుడి నియోజక వర్గమని తెలిసినా కూడా… గెలిచి తీరాలన్న వ్యూహంతో తెరాస ముందుకెళ్లింది. పోల్ మేనేజ్మెంట్ చక్కగా చేసింది. సరే, అధికార పార్టీగా కొన్ని సానుకూలతలు వారికీ ఉండొచ్చు. కానీ, ప్రతిపక్షంగా హుజూర్ నగర్లో బలమైన పోటీని కాంగ్రెస్ ఏ దశలోనూ ఇవ్వలేకపోయింది. ఇంకోటి… తెరాస నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే… ఎన్నికల సమయంలో పోరాట స్ఫూర్తి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెర మీదికి వచ్చిన దగ్గర్నుంచే కాంగ్రెస్ నాయకుల్లో ఐకమత్యం కొరవడింది. రేవంత్ రెడ్డి ఒకమాట అంటే, కోమటిరెడ్డి ఇంకోటి అంటారు. సీనియర్ నేత వీహెచ్ ది మరో తీరు! ముందుగా ఈ పరిస్థితిని అంతర్గతంగా మార్చుకుంటే… రాబోయే ఏ ఎన్నికల్లోనైనా పోరాడే విధానంలో కూడా పకడ్బందీతనం అదే సహజంగా వచ్చేస్తుంది. ఇప్పుడు విశ్లేషించుకోవాల్సింది బయట పరిస్థితులపై కాదు… పార్టీలోపలున్న లోపాలపై!