హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ట్వీట్లపర్వం కొనసాగుతోంది. ఏపీకోసం పార్లమెంట్లో ఎంతో కృషి చేస్తున్నామని చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని, రాష్ట్రానికి సంబంధించిన కీలక చర్చలో పాల్గొనలేదనటానికి సాక్ష్యాలను పవన్ ఇవాళ బయటపెట్టారు. ఇవాళ్టి మొదటి ట్వీట్లో, గత మార్చి 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణల బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టినపుడు సీమాంధ్ర ఎంపీలు ఎందరు పాల్గొన్నారని ప్రశ్నించారు. తనకున్న సమాచారంమేరకు ఐదుగురు ఎంపీలే ఈ చర్చలో హాజరయ్యారని, మిగిలినవారు ఎందుకు హాజరు కాలేదంటూ పరోక్షంగా కేశినేనినుద్దేశించి వ్యాఖ్యానించారు. నాని పార్లమెంట్ కార్యకలాపాలకు సంబంధించిన ఒక వెబ్ పేజి లింక్‌ను ఇచ్చారు. ఆ పేజిలోని వివరాల ప్రకారం నాని మార్చి 15వ తేదీ ఏపీ పునర్విభజన సవరణల బిల్లపై చర్చలో పాల్గొనలేదని స్పష్టంగా ఉంది. చట్టాలు, చట్టాల రూపకల్పన, చట్టసభలపై అధ్యయనం జరిపి వాటిని మరింత పారదర్శకంగా చేయటంకోసం పీఆర్ఎస్ అనే ప్రముఖ స్వచ్ఛందసంస్థ నడుపుతున్న రీసెర్చ్ వెబ్సైట్ పీఎస్ఆర్ఇండియా.ఆర్గ్(prsindia.org)లోని లింకునే పవన్ ఇవాళ ట్విట్టర్లో ఇచ్చారు. ఈ సైట్ ఉన్నతప్రమాణాలతో నిర్వహించబడుతూ ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటోంది. ఈ సైట్లో ప్రతి ఎంపీ పార్లమెంట్లో ఏమి మాట్లాడారు, ఏ ప్రశ్నలు అడిగారు అనే ప్రతి విషయాన్నీ పొందుపరుస్తారు. ఒక్కో ఎంపీకి ఒక్కో పేజి కేటాయించి దానిలో వారి పార్లమెంట్ కార్యకలాపాల సమాచారాన్నంతా ఇస్తారు.