ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో నిర్వహించబోయే మార్చ్ ఫాస్ట్‌కు.. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఇసుక సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పక్షాలు కలసికట్టుగా పోరాడాలని.. పిలుపునిస్తూ… అన్ని పార్టీల అగ్రనేతలకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఫోన్ చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణ, తులసిరెడ్డి, సంపత్ రావు, డి.వి.వి.ఎస్. వర్మలకు ఫోన్ చేశారు. పార్టీలో చర్చిస్తామని కాంగ్రెస్, వామపక్షాలు, లోక్ సత్తా, బి.ఎస్.పి. నేతలు హామీ ఇచ్చారు.
ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్నామని… నవంబర్ 3వ తేదీన విశాఖపట్నం లో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్‌కి సంఘీభావం ప్రకటించాలని పవన్ అందర్నీ కోరుతున్నారు. మార్చ్ ఫాస్ట్ ను అత్యంత భారీగా నిర్వహించి… ప్రభుత్వం మెడలు వంచాలన్న లక్ష్యంతో.. పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలూ కలసి పోరాడాలని కొద్ది రోజుల కిందట పిలుపునిచ్చిన ఆయన.. ఆ దిశగా తనే ముందడుగు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా 17.80 లక్షల మంది.. పరోక్షంగా మరో 17 లక్షల మంది ఉపాధి కోల్పోయారని .. పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ… ఇసుక కోసం.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. రోజువారీగా అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ గుంటూరు… కలెక్టరేట్ ఎదుట ఒక్క రోజు నిరాహారదీక్ష చేశారు. వామపక్షాలు చాలా ఉద్ధృతంగా రోడ్డెక్కి పోరాటాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అందరి మద్దతును కూడగట్టి.. ఓ బెంచ్ మార్క్ లాంటి మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో.. అన్ని పార్టీలదీ ఒకే మాట కాబట్టి.. పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చొరవతో.. ఈ కార్యక్రమంలో అన్ని భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అన్ని పార్టీలు కలిస్తే.. మూడో తేదీ విశాఖలో భారీ ర్యాలీ జరిగే అవకాశం ఉంది.