ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే తరహాలో తమను విలీనం చేయాలనేదే కార్మికుల ప్రధాన డిమాండ్. అది మినహా… అంటూ మొదట్నుంచీ కేసీఆర్ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అప్పట్లో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు కదా అంటే… తూచ్, అలాంటి మాట మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటే చూపించండి అంటూ మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి! అయితే, విలీనమే కేంద్రంగా ఇంత చర్చ జరుగుతూ ఉంటే… తెలంగాణలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైపోయినట్టే లెక్క అంటూ ఓ లాజిక్ మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో జరిగిన ఆర్టీసీ కార్మికుల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… విలీనం అసాధ్యమని కేసీఆర్ అంటున్నారనీ, మా అజెండాలో ఎక్కడైనా ఉందా అంటూ మంత్రులూ ప్రశ్నిస్తున్నారు అన్నారు. 30 శాతం బస్సులు అద్దెకి తీసుకుంటాం, 20 శాతం ప్రైవేటీకరణ చేస్తాం, 50 శాతం మాత్రమే ప్రభుత్వ అధీనంలో ఆర్టీసీ నడుపుతుందని కేసీఆర్ చెప్పారనీ… ఎన్నికల మేనిఫెస్టోలో 20 శాతం మెగా కృష్ణారెడ్డికి అమ్ముతామనీ 30 శాతం అద్దెకి తీసుకుంటామని ఉందా అంటూ ప్రశ్నించారు. విమానాల్లో ఇంధనానికి జి.ఎమ్.ఆర్. సంస్థ నుంచి ఒక్క శాతమే పన్ను వసూలు చేస్తున్నారనీ, పేదోడు తిరిగే బస్సులకు మాత్రం 27.5 శాతం వసూలు చేస్తున్నారన్నారు. దీంతో ఆర్టీసీ మీద రూ. 700 కోట్ల అదనపు భారం మీద పడుతోందన్నారు. 18 రకాల ఉచిత బస్ పాస్ లను ప్రభుత్వం ఇచ్చి, ఆ బకాయిల్నీ చెల్లించలేదన్నారు. ఇలా చూసుకుంటే ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే అని విమర్శించారు.
మొత్తం బకాయిలు చెల్లించాలంటూ కోర్టు చెబితే, ఆర్టీసీ ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉందని కేసీఆర్ సర్కారు వాదించిందన్నారు. ఆర్టీసీ విభజన జరగనప్పుడు, పంపకాలు పూర్తికానప్పుడు… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఇక్కడ తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతుందన్నారు! ఆస్తులు, అప్పుల పంపకాలు జరగనప్పుడు సంస్థ ఒక్కటే అన్నారు. ఆ లెక్కన ఆంధ్రా తెలంగాణలో ఒకే సంస్థ ఉన్నట్టనీ, అక్కడ విలీన నిర్ణయం తీసుకుంటే ఇక్కడా అమలు చేసి తీరాల్సిందే అన్నారు. మొత్తానికి, విలీనమే ప్రధానమని ఈ సభలో మరోసారి చాటి చెప్పారు! విలీనం ఒక్కటే చర్చలకు అడ్డంకిగా ఉందంటూ కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదించింది! దాన్ని ప్రముఖం కానీయకూడదు అని ప్రభుత్వం చూస్తుంటే… అదే ముఖ్యం అన్నట్టుగా ఆర్టీసీ కార్మికులతోపాటు, మద్దతుగా నిలుస్తున్న రేవంత్ రెడ్డి కూడా కొత్త లాజిక్ తెరమీదికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.