నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా విభాగాల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సదరు పబ్లిషర్లు, ఎడిటర్లపై చట్టపరమైన చర్యలతో పాటు .. న్యాయపరంగా కేసులు దాఖలు చేసేందుకు అధికారాలను ప్రభుత్వం కల్పించింది. దేశంలో ఉన్న ఎంత నియంతృత్వం ఉన్న ప్రభుత్వం అయినా.. ఇలాంటి జీవోను జారీ చేయడానికి ఇంత వరకూ సహకరించలేదు. ఒకప్పుడు.. వైఎస్ జగన్ తండ్రి ఇలాంటి ఆలోచన చేసి.. కేబినెట్ నోట్ తయారు చేసి… వెనక్కి తగ్గారు. తనకు తెలియకుండానే.. జరిగిందని.. తప్పు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు మాత్రం.. నేరుగా జీవో ఇచ్చేశారు.
నిరాధారమైన వార్తలంటే ఏవి…?
“చినబాబు చిరు తిండి రూ. పాతిక లక్షలం”టూ… రాసిన కథనాలా..?
“నారాసుర చరిత్ర ” అంటూ వడ్డించిన కథనాలా..?
వైఎస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఉందనే కథనాలా..?
కోడికత్తి కేసులో టీడీపీ కుట్ర ఉందన్న విచారణ స్టోరీలా..?
టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు రూ. వేల కోట్లు సంపాదించారనే వార్తలా..?
ప్రభుత్వం … ఓ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అసలు నిరాధార వార్తలంటే ఏమిటో.. ప్రభుత్వం స్పష్టంగా డిఫైనేషన్ ప్రకటించాల్సి ఉంది. తనకు నచ్చని ప్రతీ వార్త మీద.. నిరాధారం అనే ముద్ర వేసి.. కేసులు పెట్టి.. మీడియా సంస్థల్ని.. వాటిలో పని చేసేవారిని వేధించడానికి … ఈ జీవో తీసుకొచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ఈ జీవోను ముందుగా అమలు చేయాలంటే.. జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిపై.. కొన్ని వందల కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. వైఎస్ చనిపోయిన రోజు వరకూ.. ప్రభుత్వం అంటే.. ఆహో.. ఓహో అన్న ఆ పత్రిక.. ఆ తర్వాతి రోజు నుంచి.. మిన్ను విరిగి మీదపడినట్లు ప్రభుత్వ వ్యతిరేకత కథనాలు ప్రచురించింది. ఆ పత్రిక .. చేసిన ఆరోపణల్లో ఇంత వరకూ.. ఒక్కటంటే.. ఒక్కటీ నిజం కాలేదు. ఇష్టం లేని రాజకీయ నేతల మీద బురద చల్లి వారి క్యారెక్టర్ పై ప్రజల్లో ఏదో ఓ అనుమానం రేకెత్తేలా చేయడమే ఎజెండా సాక్షి అభూతకల్పనలు రాసింది..ప్రసారం చేసింది. అలాంటి పత్రిక యజమాని.. ఇప్పుడు.. ఇతర పత్రికలు ఎలాంటి వార్తలు రాయకూడదంటూ.. జీవో తీసుకొచ్చారు.
రాజకీయం కోసం అధికారులెందుకు కేసులు పెట్టాలి..?
నిరాధార వార్తలని ఆరోపిస్తూ… అధికారులు కేసులు పెట్టాలని..అధికారం వారికి ధారదత్తం చేస్తూ.. జీవో తీసుకువచ్చారు. రాజకీయ పరమైన వ్యవహారాలకు… నేరుగా ప్రభుత్వ అధికారుల్ని ఉపయోగించుకోవడంలో ఇదో కోణం. ఇప్పటికే పోలీసులు.. ఇతర అధికారులు పనితీరు విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో… మీడియాపై కేసులు పెట్టించేలా చేసి.. అధికారుల్ని కోర్టుల చుట్టూ తిప్పి… తాము రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ఈ విషయంలో అధికారులు కూడా.. అసంతృప్తిగానే ఉన్నారు.
పాలు పోసి పెంచినా పాము కరుస్తుంది..!
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఏ మాత్రం సిగ్గుపడకుండా అనుభవించిన పత్రికా స్వేచ్ఛను.. జగన్… కట్టడి చేయడానికే నిర్ణయించుకున్నారు. తనకు లభించిన ఆ పత్రికా స్వేచ్ఛతోనే…టీడీపీ ప్రభుత్వంపై… రకరకాల ప్రచారాలు.. అవినీతి ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలయినా.. ఇంకా కులం పేరుతో.. టీడీపీని.. విమర్శించడమే తప్ప.. ఒక్కటంటే.. ఒక్క ఆధారాన్ని బయట పెట్టలేకపోయారు. తను అనుభవించిన స్వేచ్చ ఇతరులకు లేకుండా చేయడానికి… పాములాంటి జీవోను.. జగన్ తీసుకు వచ్చారు. ఇప్పుడు.. అది బాగానే ఉండవచ్చు. రేపు పరిస్థితులు వికటిస్తే… తననే కాటు వేస్తుంది. దాని కోసం వేచి చూడాల్సిందే..!