పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకోబోమంటూ.. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఓ గంభీరమైన ప్రకటనను.. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత విడుదల చేశారు. ఇసుక కొరతపై పవన్ కల్యాణ్.. విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. ఆయన అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారు. చంద్రబాబుకూ ఫోన్ చేశారు. అందరి కంటే ముందు.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు ఫోన్ చేశారు. ఇసుక కొరతపై.. బీజేపీలో అందరి కంటే ఎక్కువగా.. కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతున్నారు. కూలీలకు ఉపాధి లేకపోవడంపై ఆయన సానుభూతితో ఉన్నారు. అందుకే.. పవన్ పోరాటానికి ఆయన మద్దతు తెలిపారు. విశాఖ మార్చ్ ఫాస్ట్ లో పాల్గొనడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. కానీ.. దీన్ని.. వెంటనే విష్ణువర్దన్ రెడ్డి ఖండించారు. పవన్ కల్యాణ్‌తో కలిసి వేదిక పంచుకోబోమంటూ… ప్రకటన చేసేశారు.
పవన్ కల్యాణ్‌తో..కలిసి పోరాటాలు చేయకూడదన్నంత వైరం.. బీజేపీకి… ఎప్పుడూ లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ..పవన్ కల్యాణ్ ఇప్పుడూ మద్దతుగా మాట్లాడుతూంటారు. కాకపోతే….జనసేన పార్టీని …బీజేపీలో విలీనం చేయమని… ఆ పార్టీ నేతలు పవన్ పై ఒత్తిడి తెచ్చారు. తాను సొంతంగా పార్టీ నడుపుకుంటాననే క్లారిటీని పవన్ ఇచ్చారు. ఇదే బీజేపీ నేతలకు రుచించినట్లుగా లేదు. ముఖ్యంగా.. ఏపీ బీజేపీలో.. కొంత మంది నేతలకు అసలు నచ్చడం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్న సమయంలో.. ఆ పార్టీ తరపున పదవులు పొందినప్పటికీ… ఆ పార్టీనే విమర్శిస్తూ.. విపక్ష పార్టీకి కావాల్సినంత మేలు చేసిన నేతలు.. ఇప్పుడు… విపక్షాలన్నీ.. సంఘటితమై.. ప్రభుత్వంపై పోరాటడం ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇసుక కొరతపై.. బీజేపీనే మొదటి నుంచి పోరాడుతోందని.. విష్ణువర్ధన్ రెడ్డి స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ప్రెస్ మీట్లు, టీవీ చర్చల్లో తప్ప… ఆయన ఎక్కడా రోడ్డు మీద రాజకీయం చేసిన బాపతు కాదు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేసినా.. ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. అధికారం మారిన తర్వాత వైసీపీ సర్కార్ కు మద్దతుగా మాట్లాడుతూ.. టీడీపీనే ఎక్కువగా విమర్శిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి… పవన్ కల్యాణ్ ను వీలైనంత దూరం పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ వ్యూహం వెనుక.. హైకమాండ్ ఉందో.. ఏపీ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఉన్నాయో.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.